Akkineni Akhil excellent batting in the CCL match
mictv telugu

అక్కినేని అఖిల్ ఊచకోత.. దెబ్బకు క్రీజులో కూర్చున్న సుధీర్ బాబు

February 19, 2023

Akkineni Akhil excellent batting in the CCL match

 

ఐపీఎల్ మాదిరి సినిమా స్టార్లు సీసీఎల్ మ్యాచులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాయ్‌పూర్‌లో తెలుగు వారియర్స్ – కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 20 ఓవర్లలో 170 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కేరళ్ స్ట్రైకర్స్.. 105 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తెలుగు వారియర్స్ 65 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అక్కినేని అఖిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. మొదటిసారి మ్యాచ్ ఆడుతున్న సంగీత దర్శకుడు థమన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. మొదట బ్యాటింగులో 12 బంతుల్లో 21 పరుగులు చేసి తర్వాత బౌలింగులో 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

 

అఖిల్ ఊచకోత
యాక్టర్ కం ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన అక్కినేని అఖిల్ బ్యాటింగుతో కేరళ బౌలర్లను ఊచకోత కోశాడని చెప్పాలి. కేవలం 31 బంతుల్లో 90 పరుగులు చేశాడంటే ఏ స్థాయిలో రెచ్చిపోయాడో తెలుస్తోంది. అందరూ సెంచరీ చేస్తాడనుకున్నారు కానీ 9 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. ఊహించని విధంగా క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 90 పరుగుల్లో మొదటి 50 పరుగులు 15 బంతుల్లోనే రావడం విశేషం. అఖిల్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు కూడా ఏమీ చేయలేని స్థితిలో చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక నాన్ స్ట్రైకర్ బ్యాటర్ అయిన సుధీర్ బాబు అయితే ఏకంగా పిచ్‌పైనే కూర్చుండిపోవడం గమనార్హం. అఖిల్ బ్యాటింగ్ చూసిన ప్రేక్షకుల్లో కొందరైతే టీమిండియాలో చోటు గురించి బీసీసీఐ పరిశీలించాలని కోరడం విశేషం. వచ్చిన ప్రతీ బంతిని బౌండరీకి తరలించిన అఖిల్ టాలెంటును విక్టరీ వెంకటేష్ కూడా మెచ్చుకున్నారు. స్టేడియంలో తెలుగు ఆటగాళ్లకు మద్ధతు ఇస్తూ కనిపించారు.