అక్కినేని అమల పేరు చెప్పి పైసా వసూల్..  - MicTv.in - Telugu News
mictv telugu

అక్కినేని అమల పేరు చెప్పి పైసా వసూల్.. 

October 30, 2019

Akkineni Amala  ...

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనేమో. పేరున్నవారి పేరును ఎలా వాడుకోవాలా అని కొందరు మాస్టర్ ప్లాన్‌లు వేస్తుంటారు. పబ్బం గడుస్తుందని అనుకుంటారు గానీ, అడ్డంగా బుక్ అయిపోతారు. అదే జరిగింది ఇతగాడి విషయంలో. అక్కినేని అమల పేరు చెప్పి అతడు డబ్బులు గుంజుతున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అతని బండారం బయటపడింది. రాహుల్ శర్మ మోసాలపై అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఉద్యోగి ఎం.వి.బుచ్చిరాజు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ బ్లూ క్రాస్‌ సంస్థ ఛైర్‌పర్సన్‌ అక్కినేని అమలతో మాట్లాడిస్తానంటూ రాహుల్ శర్మ మోసాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొందరు యువతీ, యువకులకు ఫోన్‌ చేసి పుష్పగుచ్ఛాలు, తేనీటి విందు, వీడియో చిత్రీకరణ తదితర ఖర్చులకు డబ్బు కావాలని అడుగుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం తనకూ రాహుల్ ఫోన్ చేశాడని తెలిపారు. తాను అతడు చెప్పిందంతా విని బ్లూక్రాస్‌ లాభాపేక్షలేని సంస్థ కదా.. వారు అడుగుతున్నారా? అని ప్రశ్నించానని బుచ్చిరాజు తెలిపారు. అప్పటి విషయం ఏమోగానీ, ఇప్పుడైతే విరాళాలు అడుగుతున్నారని నేరస్థుడు చక్కా బుకాయించే ప్రయత్నం చేశాడు. రాహుల్‌ తనలా ఎంతోమందికి ఫోన్లు చేసి ఉండవచ్చని, అతడిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని బుచ్చిరాజు పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాహుల్ కోసం గాలిస్తున్నారు.