అక్కినేని హీరోలలో సుశాంత్ ఒకడు. నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటిన ఇప్పటి వరకు ఒక్క హిట్ ను అందుకోలేకపోయాడు. రెండు, మూడు సినిమాలు పర్వాలేదనిపించినా మిగతా చిత్రాలు మాత్రం ఎప్పుడు వచ్చాయో..ఎప్పుడు మారిపోయాయో తెలియని పరిస్థితి. అయినా హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా తన ప్రయోగాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. సుశాంత్. హీరోగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో తన ట్రాక్‌ను మార్చేశాడు సుశాంత్.
పెద్ద సినిమాల్లో ఇంప్టాక్ ఉన్న పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. తర్వాత . ‘రావణాసుర’ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా మరో జాక్ పాట్ కొట్టేశాడు సుశాంత్. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం దక్కించుకున్నాడు. ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కీర్తి బోయ్ ఫ్రెండ్ గా సుశాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 18న సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.
తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా ‘భోళాశంకర్’ తెరకెక్కుతోంది.మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లు మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట భావించినా తర్వాత ఆగస్టుకు వాయిదా వేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్.రామారావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.