Akshar Patel's amazing performance..Great win for India
mictv telugu

అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన..భారత్ ఘన విజయం

July 25, 2022

భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. యువ ఆటగాళ్లు తమ అద్బుత ప్రదర్శనతో క్రికెట్ ప్రియులను తెగ ఆనందింపజేస్తున్నారు. మొన్న ఇంగ్లాండుతో జరిగిన మూడు వన్డేల మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించి, సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వన్డేలో అటు బౌలింగ్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సరీస్‌ను కైవసం చేసుకొని, మరోసారి టీమిండియా సత్తా ఏంటో నిరూపించారు.

మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్..ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ ఆటగాడు విండీస్ షాయ్ హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. ఇక, కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు చేశాడు. మేయర్స్ 39, షమర్ బ్రూక్స్ 35, రోవ్‌మన్ పావెల్ 13, రొమారియో షెపర్డ్ 15 పరుగులు చేశారు.

 

అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్…మొదటగా తడబడింది. 48 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ (13) ఔట్ అవ్వగా, శుభమన్ గిల్ (43), సూర్యకుమార్ యాదవ్ (9) వికెట్లను కోల్పోంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (63), సంజు శాంసన్ (54) పరుగుల వద్ద అవుటయ్యారు. దాంతో భారత్ స్కోర్ 205 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాపై ఆశలు పట్టుకున్నప్పటీకీ (33) పరుగులు చేసి ఓట్ అవ్వగా, శార్దూల్ ఠాకూర్ (3), అవేశ్ ఖాన్ (10)తో వెనుదిరిగారు. కానీ, అప్పటికే క్రీజులో పాతుకుపోయిన అక్షర్ పటేల్ మాత్రం వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.

చివరి ఓవర్‌లో భారత జట్టు విజయానికి 8 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి అక్షర్ పటేల్ ఒక్క పరుగు తీశాడు. మూడో బంతికి సిరాజ్ మరో పరుగు తీసి అక్షర్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. మేయర్స్ వేసిన నాలుగో బంతిని అక్షర్ పటేల్ బలంగా బాదాడు. అంతే, బంతి అలా ఎగురుకుంటూ వెళ్లి స్టాండ్స్‌లో పడింది. భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. సిరీస్ సొంతం చేసుకుంది.