Akshay Kumar Ad Tweeted By Nitin Gadkari Slammed For "Promoting Dowry"
mictv telugu

వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఈ ప్రకటనే కారణమా.. వీడియో

September 13, 2022

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం నింపే ఉద్దేశంతో ఓ యాడ్‌ఫిల్మ్ రూపొందించారు. అందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. ఆరు బ్యాగులున్న కారు సురక్షితమని చెప్పేందుకు నిమిషం నిడివితో దీనిని రూపొందించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ దీనిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఈ వాణిజ్య చిత్రం వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

ఆ యాడ్ లో అప్పుడే పెళ్లయిన నూతన దంపతులు.. అత్తారింటికి వెళ్లేందుకు రెండు ఎయిర్‌బ్యాగులున్న కారులో కూర్చొని విచారంగా కనిపిస్తారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పోలీస్ అధికారి అక్షయ్ కుమార్.. ఆ వధువు తండ్రితో ఇలాంటి కారులో అమ్మాయిని అత్తారింటికి పంపుతారా అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వధువు తండ్రి బదులిస్తూ.. ఆ కారులో ఉన్న ప్రత్యేకతలు గురించి చెబుతాడు. అత్యాధునిక మ్యూజిక్ సిస్టం ఉందని చెబుతాడు. కానీ అందులో ఉన్నవి కేవలం రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమేనని పోలీస్ అఫీసర్ చెప్పడంతో అందరూ షాకవుతారు. అమ్మాయి, అబ్బాయి కారు దిగిపోతారు. సురక్షిత ప్రయాణం కోసం ఆరు ఎయిర్ బ్యాగులున్న కారును సమకూర్చాలని అక్షయ్ చెప్పడంతో వెంటనే మరో కారు వచ్చేస్తుంది. కొత్త జంట ఆనందంగా కారు ఎక్కి టాటా చెప్పి వెళ్లిపోతుంది. అయితే, ఈ యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రహదారుల లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే.. ఖరీదైన కారుల్లో వెళ్లాలని సూచించే యాడ్‌లను రూపొందించడం ఏమిటని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది, టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తదితరులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.