అక్షయ్ కుమార్ మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే సినిమాలో ఛత్రపతి శివాజీగా కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశాడు. ఈ టీజర్ ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కుంటున్నది.మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ సినిమాలో చిన్న తప్పు దొర్లింది. ముందుగా దీన్ని అక్షయ్ అభిమానులు గమనించలేదు. కేవలం అక్షయ్ ని చూసి గెటప్ అదిరిందంటూ కామెంటారు. కానీ కొందరు అందులో తప్పు వెతికి ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. శివాజీ మహారాజ్ 1674 నుంచి 1680 వరకు పాలించారు. కానీ అక్షయ్ కుమార్ చిత్రం టీజర్లో ఆయన నడిచి వస్తుంటే పైన షాండ్లియర్ లో బల్బ్స్ వెలగడం కనిపిస్తుంది. థామస్ ఎడిసన్ 1880లో బల్బ్ కనుగొన్నాడు. అంటే 200 సంవత్సరాలకు ముందే ఎలా ఛత్రపతి కాలంలోకి బల్బ్ వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద మరింత చర్చ నడుస్తున్నది.
అక్షయ్ ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో పాత్రను పోషించడం లేదట. కేవలం శివాజీ మహారాజ్ పాత్ర కోసం ఏడెనిమిది రోజులు మాత్రమే పాల్గొంటాడని సమాచారం. ఎందుకంటే ఇది మరాఠా చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం. ఇది శివాజీ మహారాజ్ స్వరాజ్యం గురించి కలలుకన్న ఏకైక లక్ష్యంతో చరిత్రలోని అత్యంత అద్భుతమైన పేజీల్లో ఒకటిగా నిలిచిన ఏడుగురు వీర యోధుల కథ. ఈ సినిమా కోసం అక్షయ్.. మరాఠా డిక్షన్ కోసం నిపుణులచే శిక్షణ తీసుకున్నాడు. 20 నుంచి 25 రోజుల పాటు ఈ శిక్షణ సాగిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం మహేష్ మంజ్రేకర్ వహిస్తున్నారు. వసీమ్ ఖురేషి నిర్మాత. ఈ సినిమాలో అక్షయ్ తో పాటు జయ్ దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే నటిస్తున్నారు. ఇది ఖురేషి ప్రొడక్షన్ సమర్పణలో మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 దీపావళికి విడుదల చేయనున్నారట.