జోరుగా అక్షయ తృతీయ అమ్మకాలు.. ధర తగ్గడంతో.. - MicTv.in - Telugu News
mictv telugu

జోరుగా అక్షయ తృతీయ అమ్మకాలు.. ధర తగ్గడంతో..

May 3, 2022

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అక్షయ తృతీయ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మార్కెట్ వర్గాలు అంచనా వేసినట్లుగానే ఈరోజు ఉదయం నుంచి బంగారం ప్రియులు నగల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల కొన్నాళ్లుగా పసిడి ధరలు తగ్గడంతో డిమాండ్ పెరిగింది. ఓవైపు విపరీతంగా ఎండకొడుతున్నా, రంజాన్ సెలవు కలసి రావడంతో కొనుగోలుదారులు జువెలరీ షాపులకు పోటెత్తుతున్నారు.

ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన విక్రేతలు.. ఈరోజు ఉదయమే దుకాణాలను తెరిచారు. గత 10 -15 రోజులుగా పసిడిలో పెట్టుబడులపై సెంటిమెంటు భారీగా పెరగుతూ వస్తోంది. నేడూ అదే కొనసాగుతోంది. అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి వైస్ చైర్మన్ శ్యామ్ మెహ్రా మాట్లాడుతూ..’ఈ అక్షయ తృతీయను పురస్కరించుకొని 25-30 టన్నుల బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఉదయం నుంచి బంగారం జోరుగా అమ్ముడు పోతోంది. మధ్యాహ్నం నుంచి దుకాణాలకు వచ్చే కొనుగోలుదారుల సంఖ్య తగ్గింది. మళ్లీ సాయంత్రం పుంజుకునే అవకాశం ఉంది” అని అన్నారు.

ఇక, బంగారం, వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీ, బెంగళూరు, ముంబైతోపాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) ధర రూ.51,510గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.52,970, లక్నోలో రూ.51,680గా, అహ్మదాబాద్‌లో రూ.51,570, పట్నాలో రూ.51,590గా కొనసాగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ. 678గా కొనసాగుతుంది.