డ్రగ్స్ కేసులో అసలు గడియలు స్టార్ట్ అయ్యాయి. విచారణకు సంబంధించి నోటీసులు సెక్షన్ 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద టాలీవుడ్ లో కొందరికి అందజేసినట్టు అకున్ సబర్వాల్ శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో రోజు విచారణ వుంటుందట.
ఈ నెల 19 నాడు పూరీ జగన్నాథ్ ను, 20 ఛార్మీని, 21 ముమైత్ ఖాన్ ను, 22 న సుబ్బరాజును, 23 న శ్యాం కె నాయుడును, 24న రవితేజ, 25 న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ ను విచారణ నిమిత్తం వారు తప్పనిసరి సిట్ కార్యాలయానికి రావాల్సి వుంటుందని, రానిచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా వెల్లడించారు., ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక ఒక్కొక్కరికి కౌంట్ డౌన్ మొదలైనట్టే. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇంత వరకూ మీడియాలో విన్పిస్తున్న పేర్లే ప్రధానంగా వుంటాయా ? వేరే కొత్త పేర్లు తెర మీదికొస్తాయా ? అనేది త్వరలోనే తేలుతుందన్నమాట. ఈ తతంగం వల్లనైనా టాలీవుడ్ కు పట్టుకున్న డ్రగ్స్ మత్తు వదులుతుందేమో చూడాలి.