ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూపులో చేర్చబడిన అల్ ఖైదా తన కొత్త చీఫ్ ను ఎన్నుకుంది. ఉగ్రవాద సంస్థ కొత్త కమాండర్ గా సైఫ్ అల్ అదల్ ఎంపికైనట్లు సమాచారం. గతేడాది జూలైలో అల్ ఖైదా మాజీ చీఫ్ అల్ జవహిరి అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి నుంచి ఈ సంస్థ దాని చీఫ్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది. అల్ ఖైదాకు కొత్త నాయకుడిగా సైఫ్ అల్-అద్ల్ సోమవారం ఎన్నుకున్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
9/11 దాడిలో కీలక పాత్ర పోషించిన సైఫ్ అల్-అద్ల్:
సైఫ్ అల్-అద్ల్ ఈజిప్టు సైన్యంలో మాజీ కల్నల్, 1980 నుండి అల్-ఖైదాతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు . అమెరికాలోని పెంటాగాన్ 9/11 దాడిలో సైఫ్ కూడా కీలక పాత్ర పోషించాడు. నిజానికి ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు, హైజాకర్లకు శిక్షణ ఇచ్చింది కూడా ఇతనే. సైఫ్ అల్-అద్ల్ వయస్సు 62 సంవత్సరాలు. ఉగ్రవాద పార్టీల అధికారాన్ని విస్తరించడానికి చాలా కృషి చేశాడు. సైఫ్ అల్-అద్ల్ 2002-2003 నుండి ఇరాన్‌లో నివసించాడు. అక్కడి నుంచే తన ఉగ్రవాద కార్యాకలాపాలు కొనసాగించాడు. ఇప్పటి వరకు వందలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు అల్ ఖైదా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అప్పట్లో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను రక్షించే బాధ్యత కూడా అల్ అద్ల్ తీసుకున్న సంగతి తెలిసిందే.
సైఫ్ పై 10 మిలియన్ డాలర్ల రివార్డు:
సైఫ్‌పై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. అల్ అద్ల్ చేసే దాడులన్నీ చాలా క్రూరంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్త జిహాదీ ఉద్యమంలో అత్యంత అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ సైనికులలో సైఫ్ కూడా ఉన్నాడు. ఆయన చాలాసార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు సమాచారం. సైఫ్ తెర వెనుక దాక్కుని ఎన్నో పెద్ద దాడులకు ప్లాన్ చేశాడని అందుకే ఆయన్ను చీఫ్‌గా చేశాడని నిపుణులు అంటున్నారు.