కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కాలుష్యానికి గురికావడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది మీ ఆలోచన, పని సామర్థ్యా మీద ప్రభావం చూపుతుందని కొత్త అధ్యయనం చెబుతున్నది.
మీ శరీర పనితీరుపై ట్రాఫిక్, వాయు కాలుష్య ప్రభావం ఉంటుందని మీకు తెలుసా? ఈ రెండింటి వల్ల మెదడు పై తెలియని ఒక రకమైన ఒత్తిడి పడుతుందని తాజా అధ్యయనం చెబుతున్నది. ఫంక్షనల్ మాగ్నటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్ఆర్ఐ)ని ఉపయోగించి, ప్రయోగం ద్వారా ప్రభావం గురించి లెక్కించిన మొట్టమొదటి అధ్యయనం ఇది.
ముప్పు తప్పదు..
ప్రపంచంలోని ప్రతీ నగరం, గ్రామం అని లేకుండా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటూనే ఉంటారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుందే తప్ప తగ్గడం లేదు. అయితే ఈ సమస్య మనిషి మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని మీరు ఊహించలేదు కదా! అదే పనిగా ట్రాఫిక్ లో ఉండడం వల్ల వాయు కాలుష్యం మనల్ని చుట్టుముడుతుంది. దీనివల్ల మెదడు ఫంక్షనల్ కనెక్టివిటీ తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. సీనియర్ డాక్టర్ క్రిస్ కార్ల్ స్టన్ ప్రకారం వాయు కాలుష్యం కంటే కూడా ఈ ట్రాఫిక్ సమస్య వల్ల మరింత ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. కార్ల నుంచి వచ్చే డీజిల్ ఎగ్జాస్ట్ కారణంగా మెదడు పని తీరు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది.
మెదడు పనితీరు..
బ్రెయిన్ నెట్ వర్క్ పూ డీజిల్ ఎగ్జాస్ట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో ల్యాబ్ లోనే సెట్టింగ్స్ చేశారు. వేర్వేరు వ్యవధిలో డీజిల్ ఎగ్జాస్ట్, ఫిల్టర్ చేసిన గాలిని వదిలారు. 25మంది ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఈ గాలి ద్వారా వచ్చే దాన్ని ఎఫ్ఎమ్ఆర్ఐ ద్వారా ఎక్స్ పోజర్ కు ముందు, తర్వాత మెదడు కార్యకలాపాలను కొలిచారు. వారు మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ (డీఎమ్ఎన్) లో మార్పులను విశ్లేషించారు. దీనిద్వారా డీజిల్ ఎగ్జాస్ట్ కారణంగా మెదడు పనితీరు తగ్గిందని రుజువైంది. ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం ప్రజల ఆలోచనా సామర్థ్యాన్ని లేదా పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధన పేర్కొంది.