యంగ్ కనిపించాలని ఎవరికి ఉండదు. దీనికోసం పడని పాట్లు ఉండవు, కాదంటారా. యంగ్ గా కనిపించడానికి ఆహారం మార్చుకుంటారు, ఎక్సర్సైజులు చేస్తారు, క్రీములు రాస్తారు….వాట్ నాట్. అయితే వీటన్నింటితో పాటూ ఇంకో పని కూడా చేయాలి. అదేంటో తెలుసా. మందు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే ఇంకా బెటర్.
ఈరోజుల్లో మందు తాగడం పెద్ద విషయమేమీ కాదు. చాలా సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు, మగవాళ్ళు మాత్రమే తాగే వారు కానీ ఇప్పుడు టీనేజ్ పిల్లల దగ్గర నుంచీ, ఆడ, మగా తేడా లేకుండా తాగేస్తున్నారు. మందు ఇప్పుడొక సోషల్ స్టేటస్ కూడా. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే లిక్కర్ ఏజింగ్ మీద ప్రభావం చూపిస్తుందిట. వయసు మీదపడుతున్న కొద్దీ మన శరీరంలోని పార్ట్ లను, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. మందు ఎక్కువగా తాగేవారిలో వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేస్తాయని అంటున్నారు.
నీరు తగ్గిపోతుంది:
మామూలుగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది, అది స్వాభావికం. దాహం వేయటమూ తగ్గుతుంది. దీనికి మద్యం తోడైతే…అగ్నికి ఆజ్యం పోసినట్టే అంట. లిక్కర్ ఒంట్లోంచి నీరు మరింత బయటకు వెళ్ళిపోయేలా చేస్తుందిట. దాంతో నీరసం, ముఖ్యంలో కళ తగ్గిపోవడం లాంటివి జరగుతాయి.
చర్మం పొడిబారుతుంది:
వయసు మీద పడుతున్న కొద్దీ మన చర్మం పలచన అవుతుంది. దాంతో పాటూ డ్రై కూడా అయిపోతుంది. మన ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గిపోయి ముడతలు వచ్చేస్తాయి. దీనికి తోడు బయట పొల్యూషన్, ఒత్తిడి లాంటి కారణాల వలన కూడా చర్యం ముడతలు పడిపోతోంది. దీన్ని మందు మరింత ఎక్ువ చేస్తుందిట. ముందే చెప్పుకున్నట్టు మద్యం ఒంట్లో నీటిని పోగొడుతుంది కాబట్టి మన చర్మం పొడిబారిపోయి మరింత తొందరగా ముడతలు పడిపోతుంది.
బుర్ర మొద్దుబారిపోతుంది:
మనం తాగే ప్రతీ చుక్కా డైరెక్ట్ గా మన బుర్రలోకే వెళుతుంది. ఏంటీ నమ్మడం లేదా. ఇది అచ్చంగా నిజం. ఎక్కువ తాగే వారిలో మెదడు కణాలు కుచించుకుపోయాయని సర్వేలు చెబుతున్నాయి. మద్యం తాగడం వలన మెదడు క్షీణిస్తుంది. కొన్ని రకాల డిమెన్షియాకు కారణమవుతుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, భావోద్వేగాలపై ట్టు కోల్పోవడం, కోపం రావడం లాంటి లక్షణాలు కలుగుతాయి.
ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్:
మందు తాగితే లివర్ దెబ్బ తింటుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. లివర్ దెబ్బ తింటే ఆటోమాటిక్ గా మిగతా బాడీ పార్ట్స్ కూడా పాడవుతాయి. కీలక అవయవాల సామర్ధ్యం దెబ్బ తింటే వృద్ధాప్యం తొందరగా వచ్చినట్టే అంటున్నారు డాక్టర్లు.
త్వరగా మత్తు:
వయసు మీదపడుతున్న కొద్దీ కండరాలు క్షీణిస్తుంటాయి. దీనివల్ల ఒంట్లో కొవ్వు తప్ప ఇంకేమీ మిగలదు. ఇది మద్యాన్ని ఎక్కువసేపు బాడీలో ఉండేలా చేస్తుంది. మత్తు కూడా తొందరగా ఎక్కుతుంది. దీనివల్ల తలనొప్పి, హ్యంగోవర్ లు పట్టిపీడిస్తాయి.
ఉన్నవాటిని మరింత ఎక్కువ చేస్తుంది:
కొంతమందికి చిన్నవయసు నుంచే డయాబెటీస్, ఆస్తమా, బీపీ లాంటి సమస్యలు ఉంటుంటాయి. అలాంటివారు లిక్కర్ ఎక్కువ తీసుకోవడం వలన మరింత నష్టం జరుగుతుంది. మందు వీటిని మరింత ఎక్కువ చేస్తుంది తప్ప ఉపయోగమేమీ ఉండదు.
మందులు కూడా పనిచేయవు:
మందు తాగడం వలన మనం తీసుకునే మెడిసిన కూడా వ్యర్ధమయిపోతుంది. అవి పని చేయకపోవడం పక్కన పెడితే కొన్ని ట్యాబెట్లకు లిక్కర్ తోడైతే మరింత బెడిసి కొడుతుంది కూడా. అవి రెండూకలిసి మరో కొత్త జబ్బుకు దారితీస్తాయి.
నిద్ర:
మద్యంతో మత్తు ఎక్కుతుంది. అందులో నో డౌట్. కానీ మద్యం అలవాటుగా మారితే మత్తు సంగతి తర్వాత మనకున్న నిద్ర కూడా పోతుంది. మత్తు మహా అయితే రెండుగంటలు ఉంటుంది కానీ తర్వాత నిద్రలోంచి మెలుకువ వచ్చేస్తుంది. తర్వాత ఎంత గింజుకున్నా నిద్రపట్టదు. నిద్ర లేకపోతే మన ఆరోగ్యం దాంతో పాటూ మన యవ్వనం కూడా హుష్ కాకి అయిపోతాయి.
కాబట్టి ఎప్పుడూ చెప్పుకునే మాటే మరోసారి చెప్పుకోవాలి ఇక్కడ కూడా. అతి సర్వత్ర వర్జయేత్ అని. ఎప్పుడైనా ఒకసారి తాగితే పర్వాలేదు. కానీ అదే అలవాటుగా మారితే…ఏదైనా సరే ప్రమాదమే. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనమూ, మన ఆరోగ్యం, మన యవ్వనం, అందం అన్నీ భద్రంగా ఉంటాయి.