Alcohol unites people.. Minister's sensational comments
mictv telugu

మద్యం ప్రజలను ఏకం చేస్తుంది.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

September 1, 2022

మద్యం ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. అందుకే మద్యం సేవించవద్దని పెద్దలు, ప్రభుత్వాలు కూడా ప్రచారం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. ప్రభుత్వాలే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఆదాయం కోసమని సమర్ధించుకున్నా దాని వల్ల కలిగే దుష్ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మధ్య మద్యం సేవించడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పేవారు ఎక్కువయ్యారు. తాజాగా చత్తీస్ గఢ్ విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ మద్యాన్ని సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నశా ముక్త్ అభియాన్ కార్యక్రమం కింద డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన పోలీసులు ప్రారంభం కోసం మంత్రిని ఆహ్వానించారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్ధులను ఈ కార్యక్రమానికి రప్పించగా, వారి ముందే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘నేను ఇటీవల ఓ సభకు హాజరయ్యాను. అక్కడ ఓ వర్గం లిక్కర్ అనారోగ్యానికి కారణం అని, నిషేధం విధించాలని కోరింది. మరో వర్గం లిక్కర్‌కి సపోర్టుగా మాట్లాడింది. మద్యం ప్రజలను ఏకం చేస్తుంది. కానీ, నియంత్రణ ఉండాలి. మనం కూడా పండుగలు, ఉత్సవాలు, ఎన్నికల్లో మద్యాన్ని వినియోగిస్తాము’ అని అభిప్రాయపడగా, ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో విపక్ష పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రాకర్ స్పందిస్తూ మంత్రిపై సెటైరిక్‌గా కామెంట్ చేశారు. ‘సీఎం భూపేష్ భగేల్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఈ విషయం ప్రభుత్వంలో ఉన్న వారెవరికీ అర్ధం కాదు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’ అని ఆరోపించారు. కాగా, కొద్ది రోజుల క్రితం మరో బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మద్యానికి బదులుగా భంగ్, గంజాయిని ప్రోత్సహించాలని కోరారు. దీంతో ఈ విషయం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.