Alert: Heavy rains for 3 days in AP, Telangana
mictv telugu

అలర్ట్: ఏపీ, తెలంగాణలో..3 రోజులు భారీ వర్షాలు

September 4, 2022

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, కాసేపటిక్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటన ప్రకారం..”ఏపీలో దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయి.

ఇక, తెలంగాణ విషయానికొస్తే..రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉత్తర దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమోరిన్ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది” అని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు.

మరోపక్క ఏపీలో..శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల, సుంకేసుల నుంచి 1,32,829 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుతుంది. 10 అడుగుల ఎత్తులో తెరిచిన 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.