Aleru former MLA Budida Bikshamaiah Goud resigned from BJP
mictv telugu

బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

October 20, 2022

Aleru  former MLA Budida  Bikshamaiah Goud resigned from BJP

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి టీఆర్ఎస్ ను వదిలి ఆరు నెలల క్రితం కాషాయ కండువా కప్పుకున్న ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. “బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని” గురువారం తెలిపారు.

“తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటు భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బిజెపి హై కమాండ్ కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలనికే అర్థమైంది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పటిదాకా ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. నా సొంత పూర్వ నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకే తలమాణికంగా నిలిచేలా నిర్మాణం చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కనీసం గుర్తించలేని బిజెపి వైఖరి, వారు చేప్పే మాటలకి వారి చేతలకు అర్థం లేదనే విషయం తేలిపోతుంది. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బిజెపి స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.

నల్లగొండలో కొమటిరెడ్డి సోదరుల వలన వందల మంది గౌడ సోదరుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు. కోమటి రెడ్డి సొదరుల దుర్మార్గపు రాజకీయల నుంచి దూరంగా పోయేందుకే బిజెపిలో చేరాను. కానీ రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి బిజెపిలోకి వచ్చారు. అయన వేల కోట్ల అర్ధిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బిజెపి పార్టీ బిసిల మనోభావాలకు విలువ లేకుండా చేసింది. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేఖంగా బిజెపి పార్టికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

ఇప్పటికైనా ప్రజలను చీల్చుకుంటూ, శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మతచిచ్చు రగిలించవద్దని పార్టీని వీడుతున్న సందర్భంగా బిజెపికి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఈ ఉపఎన్నిక సందర్భంగా అయినా మునుగొడు నియోజక వర్గంలో బిజెపి ఇచ్చిన హమీలు నేరవేర్చి తమ నిబద్దత నిరూపించుకోవాలని కోరుతున్నాను” అని భిక్షమయ్య గౌడ్ మీడియాకు తెలిపారు.