మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా.. గొంగిడి సునీతకు పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా.. గొంగిడి సునీతకు పాజిటివ్

July 4, 2020

Aleru TRS MLA Tested Corona Positive

తెలంగాణలో ప్రజా ప్రతినిధులను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. వరుసగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కూడా పాజిటివ్ అని తేలింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరీక్షలు చేయించుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె యశోద ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. ఇప్పటికే ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాధికి గురయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వదలకపోవడంతో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. 

సునీతకు పాజిటివ్ అనే విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలతోపాటు అభిమానులు, అనుచరులు టెన్షన్‌లో ఉన్నారు. తమకు ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆమె భర్త మహేందర్ రెడ్డి శాంపిల్స్ కూడా సేకరించారు. అతని పరీక్ష వివరాలు రావాల్సి ఉంది. సునీతా కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేశారు. ఆమె నివాస ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తన అభిమానులకు సునీత ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం చేస్తున్నారని తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి దయవల్ల పూర్తి ఆరోగ్యంతో తాను త్వరలోనే ఇంటికి చేరుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.