మనుషులతో గ్రహాంతర వాసుల కామెడీ.. అమెరికాలో మాయమై రుమేనియాలో ప్రత్యక్షం.. - MicTv.in - Telugu News
mictv telugu

మనుషులతో గ్రహాంతర వాసుల కామెడీ.. అమెరికాలో మాయమై రుమేనియాలో ప్రత్యక్షం..

December 2, 2020

bgbv

గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో తెలియదుగాని వాళ్ల కామెడీ మాత్రం శ్రుతి మించుతోంది! అమెరికాలోని ఉటా ఎడారిలో కనిపించిన మిస్టరీ పిల్లర్ ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కొన్ని రోజుల తర్వాత హటాత్తుగా మాయమైంది. తాజాగా యూరప్ దేశమైన రుమేనియాలో దర్శనమిచ్చింది! గ్రహాంతరవాసులు దీన్ని ఉటా ఎడారి నుంచి తీసుకొచ్చి రుమేనియాలో పడేశారని భావిస్తున్నారు. ఈ పిల్లర్ వల్ల భూగోళానికి ఏదో ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పది రోజుల కిందట అమెరికా సర్వే అధికారులు ఉటా ఎడారిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎర్ర రాళ్ల మధ్య ఒక పెద్ద లోహపు దిమ్మె కనిపించింది. అది అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. దాని ఎత్తు తొమ్మిదిన్నర అడుగులు.  అది 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్‌ ఒడెస్సీ’’ చిత్రంలోని గ్రహాంతర వాసుల పిల్లర్‌లా ఉండడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అది ఓ శిల్పమని, తమాషా కోసం ఎవరో పెట్టి ఉంటారని భావించారు. తర్వాత ఆ పిల్లర్ కాస్తా మటుమాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

గొడవ సద్దుమణగ్గానే సీన్ రుమేనియాకు మారింది. ఆ దేశంలోని పెట్రోదోవా డేసియన్ కోట వద్ద ఓ లోహపు దిమ్మె అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అది అమెరికా ఎడారిలో కనిపించిన దిమ్మెలాగే ఉండడంతో చర్చ మొదలైంది. ఎత్తుకూడా ఉటా ఎడారి దిమ్మె ఎత్తంతే ఉంది. ఏలియన్లు అమెరికాకు భయపడి దాన్ని రుమేనియాకు తీసుకొచ్చారని వార్తలు షికార్లు కొట్టాయి. అమెరికాలో కనిపించిన దిమ్మెతో పోలిస్తే ఈ దిమ్మె కాస్త భిన్నంగా ఉంది. దీనిపై ఏవో రాతలు కూడా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోకముందే కథ మరో మలుపు తిరిగింది. ఆ దిమ్మె కూడా రాత్రికి రాత్రి మాయమైంది. అటు అమెరికాలో, ఇటు రుమేనియాలో ఈ దిమ్మెలు హఠాత్తుగా పుట్టుకురావడం, అంతే హఠాత్తుగా మాయం కావడం వెనక గ్రహాంతర వాసులు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే పనీపాటా లేని మనుషులే సరదా కోసం ఇలాంటి పని చేస్తున్నారని కూడా కొందరు చెబుతున్నాయి. మొత్తానికి దిమ్మెలు మిస్టరీ మాత్రం వీడలేదు.