ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి అక్రమాలల కేసులను ముందుకు సాగనివ్వకుండా ప్రయత్నిస్తున్నారని ఆలిండియా బార్ అసోసియేషన్ విమర్శించింది. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిష్ట దెబ్బతినేలా ఆరోపణలు చేసిన జగన్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఆయన న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
జగన్పై మనీలాండరింగ్, అవినీతి కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేసిన బార్.. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులపై జస్టిస్ రమణ విచారణ జరుపుతున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాయడం పలు అనుమానాలకు వీలుకల్పిస్తోందని పేర్కొంది. జస్టిస్ రమణ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నమోదం చేయడం సరికాదని పేర్కొంది. ఏపీ హైకోర్టు పనితీరును జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాయడం తెలిసిందే. జస్టిస్ రమణపై బురదజల్లడం సరికాదని, ఇది తీవ్రమైన విషయమని బార్ అసోసియేషన్ చైర్మన్ ఆదిశ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.