ఏపీలో నేటి నుంచే సదరం స్లాట్ బుకింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో నేటి నుంచే సదరం స్లాట్ బుకింగ్

July 7, 2022

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి (గురువారం) సదరం స్లాట్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ స్లాట్ బుకింగ్‌లు చేసుకునే వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.సెప్టెంబర్ వరకు ఈ స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.

”విద్య, ఉపాధి, కుటుంబ అవసరాల నిమిత్తం రాష్ట్రంలోని వేరే జిల్లాల్లో ఉంటున్నవారు సదరం సర్టిఫికెట్ పొందడానికి సొంత జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజల సౌకర్యార్థం ఇతర జిల్లాల్లోని సదరం క్యాంపుల్లో కూడా సర్టిఫికెట్లు పొందొచ్చు. రాష్ట్రంలో సదరం క్యాంపులు నిర్వహించే ఏ ఆస్పత్రిలోనైనా ప్రజలు స్లాట్ బుకింగ్‌లు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 171 ప్రభుత్వా ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎటో వైద్యులు పరీక్షలు నిర్వహించి, అరులైన వారికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తారు” అని అధికారులు తెలిపారు.

సదరం సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సంక్షేమ పథకాల ద్వారా జారీ చేస్తుంది. దీని ద్వారా దివ్యాంగులకు సమాజంలో మిగతా వారితో సమానావకాశాలు కల్పించడంతోపాటు, వారికి ప్రత్యేక వాహనాలను, విద్య, ఉపాధికి దోహదపడేలా అవకాశాలను కల్పిస్తుంది. ఈ క్రమంలో జగన్ సర్కార్ సదరం సర్టిఫికెట్ల విషయంలో మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.