All the tickets are sold out.. Only these come: HCA
mictv telugu

టీ20 టికెట్లన్నీ ఖతం..వీళ్లు మాత్రమే రండి: హెచ్‌సీఏ

September 23, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం జింఖానా మైదానానికి క్యూ కట్టారు. అయితే, గురువారం టికెట్ల కోసం క్యూలో నిలబడిన అభిమానులు..ఒక్కసారిగా ఎగబడడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో..భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో టీ20 టికెట్లన్నీ అమ్ముడయ్యాయని వెల్లడించింది. అంతేకాదు..”ఇదివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి, ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి. శుక్ర, శని, ఆదివారాల్లో కౌంటర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లు.. ఈ మెయిల్ కన్ఫర్మే షన్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, దాని జిరాక్స్‌ను ఇచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి” అని తెలియజేసింది.

ఇక, ఇతరులు బుక్ చేసిన టికెట్ల విషయంలో..ఇద్దరి ఫొటో గుర్తింపు కార్డులు, జిరాక్సులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, ఫిజికల్ టికెట్లు ఉంటేనే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు అనుమతి ఉంటుందని హెచ్‌సీఏ తెలియజేసింది.