'అల్లరి పిల్ల' వల.. 8 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘అల్లరి పిల్ల’ వల.. 8 మంది అరెస్ట్

March 8, 2022

police

ఆంధ్రప్రదేశ్‌లో అల్లరి పిల్ల మాయలో పడి ఓ ఎనిమిది యువకులు అరెస్ట్ అయిన సంఘటన కలకలం రేపింది. ఇంతకి ఎవరు ఈ అల్లరి పిల్ల? ఏం మాయ చేసింది? ఏం జరిగింది? అనే పూర్తి వివరాల్లలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలో ఫేస్‌బుక్ ద్వారా ఫోన్‌లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్న 8 మంది కిలాడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”అల్లరి పిల్ల అనే ఫేస్ బుక్ ప్రొఫైల్‌తో పలువురికి వల వేసి మోసం చేసినట్లు గుర్తించాం. మొదట అల్లరి పిల్ల ఐడీ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి, ముఠా బాధితులతో పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ మెస్సెంజర్ ద్వారా చాటింగ్ చేసి యువతుల ద్వారా వీడియో కాల్స్ చేయిస్తారు. అయితే.. వీడియో కాల్స్ మాట్లాడడానికి ఐఎంఓ అప్లికేషన్ ఇన్ స్థాల్ చేసుకోమని ఒత్తిడి చేస్తారు. అలా ఐఎంఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసిన బాధితులతో యువతులు మాట్లాడినట్లు మాయ చేస్తారు. అనంతరం ఐయంఓ లిటిల్ అప్లికేషన్ ద్వారా మొబైల్ హ్యాక్ చేస్తారు” అని తెలిపారు.

ఇలా చిత్తూరులోని సీకే మౌనిక్ అనే యువకుడి బ్యాంక్ ఖాతా నుండి నుంచి దాదాపు 4 లక్షల రూపాయలు కాజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. అయితే పట్టుబడిన ఈ నిందితులు విశాఖపట్నం, వరంగల్, కడప జిల్లాలకు చెందిన వారుగా గుర్తించాం. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు.