"Allegations False, Not Scared Of Going To Jail,"Says Manish Sisodia
mictv telugu

‘నేను ఈడీ, సీబీఐలకు భయపడను’.. మనీష్ సిసోడియా

February 26, 2023

"Allegations False, Not Scared Of Going To Jail,"Says Manish Sisodia

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అతడిని విచారించనున్నారు. అయితే సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు ఢిల్లీ నగర వీధుల్లో బలప్రదర్శన చేశారు. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలతో సీబీఐ (CBI) విచారణకు బయలుదేరిన ఆయన ఘాట్ లో దీక్షకు దిగారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాను ఇవాళ సీబీఐ విచారణకు వెళ్తున్నానని..అయితే నన్ను అరెస్ట్ చేసినా బాధపడనని అన్నారు. నేను ఈడీ, సీబీఐలకు భయపడను. తప్పు చేసిన వారు భయపడతారు. తాను భగత్ సింగ్ అనుచరుడినని..ఆయన కూడా ఇలాంటి ఆరోపణలతోనే ఉరి తీయబడ్డారని’ అన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చూసి భయపడుతోందని చెప్పారు. అందుకే తమపై తప్పుడు కేసులు పెట్టి మోదీ సర్కారు వేధిస్తోందని ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేసి, ఏడెనిమిది నెలలపాటు జైలులోనే ఉంచేస్తారని చెప్పారు. ఇంటి దగ్గర తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా ఉందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీ విద్యార్థులు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకోవాలని సిసోడియా సూచించారు.

అంతకుముందు తన నివాసం నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు బయలుదేరి వెళ్లిన సిసోడియా.. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే మౌనంగా గడిపారు. ఆ సమయంలో ఆయన వెంట ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాత్రమే ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు రాజ్ ఘాట్ లో గడిపిన అనంతరం మనీష్ సిసోడియా.. సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు సీబీఐ విచారణ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.