Allu Aravind Missed Half Share From Kantara Telugu Movie Collections
mictv telugu

చిన్నతప్పుతో జాక్‌పాట్ మిస్.. లెక్కతప్పిన అల్లు అరవింద్

October 20, 2022

కన్నడ సెన్సేషన్ ‘కాంతార’ తెలుగు బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఊరు పేరు లేని ఈ చిన్న సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సినిమా బావుంటే చాలు భాషనీ పట్టించుకోరని తెలుగు ఆడియన్స్ మరోసారి రుజువు చేశారు. ఇప్పటికే కన్నడనాట కాంతార మూవీ 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయగా.. తెలుగులో 20కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ టాక్. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. అల్లు అరవింద్ శిష్యుడు గీతాఆర్ట్స్2 బ్యానర్ అధినేత బన్నీ వాసు కన్నడలో కాంతారని చూసి ముగ్దుడు అయిపోయాడట. వెంటనే తెలుగులో రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్‌కు సలహా ఇస్తే.. అరవింద్‌కి కూడా కాంతార తెగ నచ్చేసి తెలుగు రైట్స్ కొనుక్కుని రిలీజ్ చేశారట. అయితే వారు అనుకున్నట్టుగానే తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది కాంతార. కానీ అల్లు అరవింద్ చేసిన చిన్న తప్పుతో పెద్ద జాక్ పాట్ మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

బిజినెస్ లెక్కల్లో ఆరితేరిన అల్లు అరవింద్ ఎందుకనో కాంతర విషయంలో లెక్క తప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రైట్స్‌ని మొత్తంగా తీసుకోలేదట అరవింద్. ఒకేవేళ రైట్స్ మొత్తం తీసుకుని ఉంటే.. ఈ రోజుకి అరవింద్ జేబులో 20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఉండేవి. కానీ సగమే అల్లు అరవింద్‌కి దక్కాయి. కారణం తెలుగు రైట్స్‌లో 50శాతం వాట కాంతార కన్నడ నిర్మాతలకే ఇచ్చేశాడట అల్లు అరవింద్. ఈ సినిమా హోల్ సేల్ స్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోకుండా, లాభాల్లో 50-50 కమీషన్ బేస్‌లో కాంతార మూవీని తెలుగులో విడుదల చేసేలా, హోంబలే నిర్మాతలతో డీల్ సెట్ చేసుకున్నారట అల్లు అరవింద్. కాంతార మూవీ తెలుగు వర్షన్ రైట్స్ హోల్ సేల్‌గా తీసుకుని ఉంటే, లాభాలు భారీగా వచ్చేవని, ఇప్పుడు లాభాల్లో సగం మాత్రమే అల్లు అరవింద్‌కు వస్తాయని, మిగిలిన సగం హోంబలే నిర్మాతలకు వెళతాయని సమాచారం. దీంతో మొత్తానికి అల్లు అరవింద్ జాక్ పాట్ మిస్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇకపోతే కాంతార మూవీని, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై, విజయ్ కిరగందూర్ నిర్మించారు.