టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మహేశ్ బాబు వేసిన స్టేజ్ డ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదని, సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్స్ కూడా రావాలని ఆయన పిలుపునిస్తూ, ఇటీవలే ఓ పెద్ద స్టార్ హీరో (మహేశ్ బాబు) సినిమా ప్రమోషన్ కోసం స్టేజ్‌పై డ్యాన్స్ వేసి తన సినిమాను ప్రమోషన్ చేసుకున్నాడని అన్నారు.
గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ సినిమాకు సంబంధించి శుక్రవారం చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని నేను చెప్పాను. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అలా చేసువాల్సిన పరిస్థతి ఏర్పడింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే, హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. మమల్ని(నిర్మాతలను) చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’అని ఆయన అన్నారు.
మహేశ్ బాబు హీరోగా, కీర్తీ సురేశ్‌ను హీరోయిన్గా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం కర్నూలు జిల్లాలో ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. కళావతి పాటకు స్టేజ్‌పై తమన్ డ్యాన్స్ బృందంతో కలిసి స్టేప్పులు వేస్తుండగా, సడన్‌గా మహేశ్ బాబు స్టేజ్ పైకి స్టేప్పులు వేసి, ఫ్యాన్స్‌ను ఆనందింపజేశాడు. మహేశ్ బాబు డ్యాన్స్‌ను ఉదాహరణగా చెప్తూ, అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్లో హాట్ టాఫిక్‌గా మారింది.