అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి

October 1, 2022

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, దివంగత అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోని శనివారం మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అల్లు రామలింగయ్య తెలుగు చిత్రసీమ పరిశ్రమ అభివృద్దికి చేసిన సేవలను కొనియాడుతూ, అల్లు కుటుంబం ఎప్పటికి ఆయన పేరును పదే పదే తలుచుకోవాలని సూచించారు.

“మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకోవటం నాకు సంతోషంగా ఉంది. ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. ప్రస్తుతం ఆయన వారసులుగా అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అందుకు ప్రధాన కారణం..కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచనే. నటనపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లి, నటుడిగా మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఆయనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యవస్థగా మారింది. అందుకు ప్రతిక్షణం అల్లు వారసులు ఆయన్ని తలచుకుంటూనే ఉండాలి” అని చిరంజీవి అన్నారు.

అనంతరం హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఇవాళ మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకెంతో ప్రత్యేకం. అల్లు అరవింద్‌కు అగ్రనిర్మాణ సంస్థ ఉంది. స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదు అని కొందరు అనుకొని ఉండొచ్చు. కానీ, డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియోని నిర్మించలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్ధంగా దీన్ని నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

ఇక, అల్లు రామయ్య లింగయ్య విషయానికొస్తే..పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న జన్మించారు. చిన్నప్పటి నుంచి రామలింగయ్యకు నాటాకాలు అంటే చాలా పిచ్చి. ఆ మక్కువతోనే ఆయనకు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో అవకాశ వచ్చింది. ఆ సినిమాలో ఆయన కూడు-గుడ్డ శాస్త్రి పాత్రలో నటించి, మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో నటించి, అంచెలంచెలుగా హాస్యనటుడిగా ఎదిగారు.