తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా ఈ నెల 16 నుంచి పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా రేపటి నుంచే (మార్చి 15) ఒంటి పూట బడులను ప్రారంభిస్తున్నామని సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవ సేన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి నుంచే ఒంటి పూట బడులు ప్రారంభిస్తున్నాం” అని అన్నారు. అనంతరం అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. జారీ చేసిన ఉత్తర్వులలో ప్రైవేట్ పాఠశాలల ఊసు ఎత్తలేదు. ప్రైవేట్ పాఠశాలలు కూడా మంగళవారం నుంచే ఒంటిపూట బడులు పెట్టేందుకు టైం టేబుల్‌ను మార్చేసుకుంటున్నాయి. ఇక ఒంటి పూట బడుల సమయానికి వస్తే.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మే20తో ముగియనున్నాయి. ఆరోజే ఈ విద్యా సంవత్సరానికి చివరి దినం కానుంది.