నేడు ఖమ్మంలో నిర్వహించబోయే బీర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ముందు దేవుని ఆశీస్సుల కోసం సీఎం కేసీఆర్ యాదాద్రికి బయల్దేరారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కూడా యాదాద్రికి కాసేపటి క్రితం చేరుకున్నారు. ఛాపర్1లో సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరయ్ విజయన్.. ఛాపర్ 2లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్సింగ్ లు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికై బేగంపేట్ నుంచి బయల్దేదారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.
యాద్రాద్రి ఆలయ అధికారులు సీఎంలను ఘనంగా స్వాగతించారు. పట్టు వస్త్రాలు సమర్పించి సన్మానించారు. నాలుగు రాష్ట్ర సీఎంలు యాదాద్రికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు చేశారు. నలుగురు సీఎంలు స్వామిని దర్శించుకున్న అనంతరం యాదాద్రి నుంచి ఖమ్మం బయలు దేరనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అల్పాహార విందు సమావేశం అనంతరం వీరంతా యాదాద్రి వెళ్లారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు యాదాద్రిలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1600 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.