విక్రంను ముందు మేమే కనుగొన్నాం..ఇస్రో చైర్మన్ శివన్ - MicTv.in - Telugu News
mictv telugu

విక్రంను ముందు మేమే కనుగొన్నాం..ఇస్రో చైర్మన్ శివన్

December 4, 2019

Already Found it, Says ISRO Chief K Sivan Day After NASA Locates Vikram Lander Debris

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌ జాడను కనిపెట్టడం వెనుక చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షణ్ముగ సుబ్రమణియన్‌ కృషి ఉందని నాసా తెలిపింది. ఈ వార్తలను ఇస్రో చైర్మన్‌ శివన్‌ ఖండించారు. చంద్రయాన్‌-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ విక్రమ్‌ ల్యాండర్‌‌ని కనిపెట్టిందని పేర్కొన్నారు. ‘ఇస్రోకు చెందిన ఆర్బిటార్‌ విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్‌సైట్‌లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్‌ చేసుకోండి’ అని శివన్‌ అసహనం వ్యక్తం చేశారు. 

 

ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌-2 అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్‌-2 నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. సెప్టెంబర్‌ 7న చివరి క్షణంలో విక్రమ్‌ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్‌ అవడానికి బదులు కొంత ఎత్తు నుంచి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్‌-2 విక్రమ్‌ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్‌ చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్‌ 17న ఎల్‌ఆర్‌ఓ తీసిన కొన్ని ఫోటోలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్‌ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్‌ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రమణియన్‌ తన ప్రయత్నం చేశారు. ఇస్రో చైర్మన్ శివన్‌ మాత్రం నాసా ప్రకటనను ఖండించారు.