తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దేశవిదేశాల కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో వచ్చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ కంపెనీ అమరరాజా రాష్ట్రంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను రూ. 9,500 కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవిపల్లిలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా 4,500 మందికి ఉపాధి దొరకనుంది.
దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. భారీ పెట్టుబడితో ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 37 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతుల, మానవ వనరులు ఉన్నాయి. మేం వారికి కావాల్సిన సాయమల్లా చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్, ఐటీ, పరిశ్రమల కార్యదర్శి సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.