Amaravati farmer who dug the road and took the gravel
mictv telugu

రాజధానికి వెళ్లే రోడ్డు కంకరను తవ్వేసి తీసుకెళ్లిన అమరావతి రైతు

September 2, 2022

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిన అమరావతిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. రాజధాని కోసం శంఖుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లే రోడ్డుపై ఉన్న కంకరను ఓ రైతు రాత్రికి రాత్రే తవ్వి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లిపోయాడు. సమాచారం అందగానే అవాక్కయిన రెవెన్యూ అధికారులు హుటాహుటిన తరలి రోడ్డును పరిశీలించారు. రైతు వివరణ కోరగా, ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పడం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు గోవింద రెడ్డి గత నెల 31వ తేదీన రాజధానికి వెళ్లే రోడ్డుపై ఉన్న కంకరను ట్రాక్టర్ల ద్వారా తరలించగా, రెవెన్యూ ఆర్ఐ ప్రశాంతి అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం రైతు వివరణ కోరగా, ఆ ప్రాంతాన్ని తాను కొనుగోలు చేశానని, చదును కోసం రోడ్డును తవ్వేసి కంకరను గ్రామంలో ప్రజావసరాలకు వినియోగించానని తెలిపాడు. దీంతో ఘటనపై నివేదిక తయారు చేసి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డికి అందజేయగా, సదరు రైతుపై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.