3 రాజధానులపై హైకోర్టులో పిటిషన్..  - MicTv.in - Telugu News
mictv telugu

3 రాజధానులపై హైకోర్టులో పిటిషన్.. 

August 3, 2020

Amaravati farmers move high court, seek stay on three capitals for Andhra.

‘మూడు రాజధానులు – ముచ్చటైన పాలన’ అని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఏపీకి మూడు రాజధానులు వద్దే వద్దు అంటున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. తాజాగా ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపి వేయాలని హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలుచేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా జీఎన్‌రావు, హైపవర్ కమిటీ ఉందని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదిలావుండగా ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం-2014 రద్దు బిల్లులను పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు, శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతిగా పాలన సాగనుంది. అధికారికంగా మూడు రాజధానులు కొనసాగేందుకు గవర్నర్ రాజముద్ర కూడా వేశారు. దీంతో రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమలులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్, సెక్రటేరియట్ కార్యాలయాలు పరిపాలనా రాజధాని విశాఖలో ఉంటాయి. అలాగే న్యాయ రాజధానిగా ఉన్న కర్నూలులో కోర్టులు, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఇక అసెంబ్లీ లెజిస్లేచర్ రాజధాని అమరావతిలో ఉంటుంది.