న్యాయమూర్తులకు దండంపెడుతూ.. రాజధాని రైతుల విన్నపం - MicTv.in - Telugu News
mictv telugu

న్యాయమూర్తులకు దండంపెడుతూ.. రాజధాని రైతుల విన్నపం

August 4, 2020

Amaravati Farmers Standing On Roadside

అమరావతిలో రాజధాని తరలింపు నిరసనలు మరింత వేడెక్కాయి. కరోనా నేపథ్యంలో స్థానిక రైతులు సరికొత్త రూపంలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రభుత్వం అన్యాయం చేస్తోందని,దీనికి న్యాయస్థానాలే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రైతులంతా హైకోర్టుకు వెళ్లే మార్గంలో వరుసగా నిలబడి న్యాయమూర్తులకు మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ వేడుకున్నారు. హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ జరగనున్న నేపథ్యంలో వినూత్న పద్దతిలో విన్నపాలు చేశారు. 

వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి భవిష్యత్ న్యాయస్థానాల్లోనే ఉందని రైతులు పేర్కొన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో గతంలో ఎన్నికలకు ముందు అమరావతి వైసీపీ నాయకులు చేసిన చేసిన ప్రకటనల క్లిప్పింగ్‌లను జత చేశారు.