Amaravati Farmers stopped the march
mictv telugu

రైతుల పాదయాత్రకు బ్రేక్.. అమరావతిపై బాబు ఎమోషన్

October 22, 2022

Amaravati Farmers stopped the march

అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండుతో అక్కడి రైతులు చేస్తున్న పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. యాత్రను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. కోర్టుకు వరుస సెలవులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, కోర్టులో తేల్చుకున్నాకే తిరిగి యాత్ర ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

అనుమతి ఉన్నా పోలీసులు అడ్డుకుంటున్నారని, మహిళా రైతులను గాయపరిచారని ఆరోపించారు. అటు అమరావతిపై చంద్రబాబు ఎమోషన్ వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అమరావతికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంఖుస్థాపన చేశామని గుర్తు చేసుకున్నారు. కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగు జాతికి గుండె చప్పుడుగా నిలుస్తుందని ఆనాడు భావించామని చెప్పారు. కానీ, తుగ్లక్ పాలన వల్ల అంతా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి, అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. నిజం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని ఇదే ఫైనల్ అంటూ ధీమా వ్యక్తం చేశారు.