కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్లోని అమర్నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత.. అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. 4,020మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్ దర్శనానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. జమ్ములోని భగవతినగర్ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయలుదేరినట్లు సైనికవర్గాలు ప్రకటించాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలు దేరినట్లు తెలిపారు.
మరో 2,425మంది 75వాహనాల్లో పెహల్గావ్ బేస్ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం పెహల్గావ్ మార్గంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బృందం వెళ్లిందని అధికారులు తెలిపారు. యాత్రికులందరూ రేపు అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అమర్నాథ్ గుహ సమీపంలో ఈనెల 8న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
ఈ వరదల్లో 16మంది మృతి చెందగా మరో 36 మంది మంది తప్పిపోయారు. భారత వాయుసేన, చీటల్ హెలికాప్టర్ల ద్వారా గాయపడిన మరో 34 మంది యాత్రికులను ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జి) మనోజ్ సిన్హా ఆదివారం పహల్గామ్లోని బేస్ క్యాంపును సందర్శించి యాత్రికులను కలిశారు. వరదలతో దెబ్బతిన్న రోడ్డు మార్గానికి మరమ్మతులు చేశారు.