అమర్ నాథ్ యాత్ర ఓ సాహసం.. అనుభూతుల సమ్మేళనం… అడుగడుగులో అపాయం..విరిగిపడే కొండ చరియలు…ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం…పాతాళాన్ని తలపించే లోయలు… క్షణంపాటు ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే..ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడి నుంచి విరుచుకుపడుతారో తెలియని ఉగ్రమూక…ఇలా ఎన్ని కష్టాలు ఉన్నా..అంతా శివయ్య చూసుకుంటాడని వేలాది మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు వెళ్తారు. పచ్చని కొండల్లో భక్తి పారవశ్యంతో బోలేనాథ్.. అమర్ నాథ్ అంటూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అపర కైలాసం- అమర్నాథ్ క్షేత్రం విశిష్టతలు మీకోసం..
# హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలిసిన అందమైన గుహ. ఆ గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది.
# శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఇక్కడే ఉంటుంది. పహల్గాం నుంచి అమర్నాథ్కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్ నుంచి బృందాలుగా అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. పహల్గాంకు శ్రీనగర్ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.
#చందన్‌వాడీ నుంచి యాత్ర సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో, కొండ అంచుల వెంట వెళ్లాలి. కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.
#చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేష్నాగ్ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు పాము పడగల్లా కనిపిస్తాయి.
ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు చెరువు ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని నమ్ముతారు.
శేష్నాగ్ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. శేష్నాగ్ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్నాథ్ వస్తుంది.
పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్నాథ్కు హెలికాప్టర్లో వెళ్లే సదుపాయం కూడా ఉంది.
# అమర్నాథ్ ముక్తి క్షేత్రం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడని పురాణాల్లో ఉంది. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో.. ఇతరులు ఎవరూ వినరాదని తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడు శివుడు. నందీశ్వరుడిని పహల్గాంలో, శిఖలోని నెలవంకను చందన్‌వాడీలో, శేష్నాగ్ దగ్గర తన ఆభరణమైన వాసుకిని వదిలివేశాడు. మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్ దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడు. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. పార్వతితో ఆనంద లాస్యం చేసి ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని తెలియజేశాడు. ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట వింది. అమర రహస్యాన్ని చెప్పిన ప్రదేశం కావడంతో అమర్నాథ్ అని పేరు వచ్చింది. ఇదంతా పురాణాల ప్రకారం…
# ఏడాది పొడుగునా.. మంచుతో కప్పి ఉంటుంది. ఏటా జూలై-ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరుచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ.. ఈ లింగాకృతి పెరుగుతూ, తగ్గతూ వుంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది.
#ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అంతా శివయ్య లీల అనుకుంటూ భక్తులు ముందుకు వెళ్తారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ.. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురిగొల్పుతూ ‘బోలేనాథ్.. అమర్నాథ్’ అని విశ్వాసంతో యాత్ర పూర్తి చేస్తారు.
#శతాబ్దాలుగా సాగుతున్న అమర్నాథ్ యాత్ర.. ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి యాత్రికుల ప్రాణాలకు ముంపు పొంచి ఉండటంతో 1991-95 మధ్యకాలంలో యాత్రను నిలిపివేసింది భారత ప్రభుత్వం. 1996లో యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో యాత్రను పునరుద్ధరించారు.
#2008లో 5.33 లక్షల మంది అమర్నాథ్ని దర్శించుకోగా… 2016లో అది కేవలం 2.20 లక్షలకే పరిమితమైంది.
#2017లో 1.46 లక్షల మంది మాత్రమే అమర్నాథ్ యాత్ర చేస్తున్నారు.
# ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది.