పోపులపెట్టె ధనం ధనియాలు.. ఆరోగ్యానికి లాభాలు ఎన్నో.. - MicTv.in - Telugu News
mictv telugu

పోపులపెట్టె ధనం ధనియాలు.. ఆరోగ్యానికి లాభాలు ఎన్నో..

August 5, 2019

Amazing Benefits Of Cilantro Or Coriander.

తెలుగువారి వంటకాల్లో ధనియాలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. కొత్తిమీర చెట్టునుంచి వచ్చే ఈ దినుసుల్లో పుష్కలమైన ఔషధ గుణాలు వున్నాయని సైన్స్ చెబుతోంది. ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అని పిలుస్తారు. చేదు, కారం, వగరు కలగలిసిన రుచితో ధనియాలు వంటల్లో ఘుమఘుమలను పండిస్తాయి. పోపుల పెట్టెలో వుండే వీటివల్ల మన శరీరానికి అనేక లాభాలు వున్నాయి. శరీరంలోని వేడిని బయటకు పంపి చల్లగా వుంచడంలో ధనియాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ధనియాలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. లైంగికశక్తిని పెంపొందించడంలో, అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించడంలో, రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడంలో ధనియాలు మంచి పాత్ర పోషిస్తాయి.  వీటిని ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. 

మనదేశంలో పెరిగి ఇతర మసాలా దినుసులతో పాటు ధనియాలు కూడా సంవత్సరం పొడవునా పండిస్తారు. ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యూరప్‌లో దీన్ని యాంటీ డయాబెటిక్ ప్లాంట్‌గా పిలుస్తారు. ధనియాల పొడిలో వాలుటైల్ ఆయిల్, ఫైటో న్యూట్రియంట్స్ అంటే లినలూల్, బోర్నియోల్, కార్వోని, ఎపిజినిన్, క్యాంపోర్ మరికొన్ని ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

ధనియాలలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె, సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన 30 శాతం విటమిన్ సి లభిస్తుంది. వీటిలో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్త్రీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది.

ధనియాలతో ప్రయోజనాలు..

 

రక్తంలో చ‌క్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం రాకుండా నిరోధించడానికి, ఉన్న వ్యాధిని నయం చేయడానికి ధ‌నియాలు ప‌నికొస్తాయి. నిత్యం ధ‌నియాల క‌షాయం తాగుతుంటే మ‌ధుమేహం అదుపులో వుంటుంది.

 

ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటకు పంపుతుంది.

 

ధ‌నియాల క‌షాయాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

 

టైఫాయిడ్‌కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధ‌నియాల్లో ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆహారం వల్ల కలిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ధ‌నియాలు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని చూపుతాయి. 

 

ప‌సుపులో ధ‌నియాల పొడి లేదా ర‌సాన్ని క‌లిపి మొటిమ‌ల‌పై రాసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

 

అంటువ్యాధులకు కారణం అయ్యే సూక్ష్మక్రిములతో పోరాడే గుణాలు ధ‌నియాల్లో ఉంటాయి. ధనియాల‌ను తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ మన శరీరానికి అందుతాయి. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

 

అంటువ్యాధులు అంటే చికెన్ ఫాక్స్ వంటివి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ఇటువంటి అంటువ్యాధులకు కారణం అయ్యే సూక్ష్మక్రిములతో పోరాడి చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయి.

 

మహిళల రుతుక్రమ సమస్యలకు ధనియాలు మంచి విరుగుడుగా పనిచేస్తాయి. అధిక బహిష్టుస్రావం తగ్గాలంటే ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే అధిక రక్తస్రావం తగ్గుతుంది.

 

మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఒక చెంచా ధనియాల చూర్ణంలో రెండు చెంచాల చక్కెరను కలిపి సేవిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

 

శరీరంలో పేరుకుపోయిన సీసం, ఆర్సెనిక్, పాదరసం, అల్యూమినియం వంటి విషపూరిత లోహాల వలన అల్జీమర్స్ వ్యాధి, జ్ఞాపకశక్తి కోల్పోవటం, కంటిచూపు మందగించటం, కార్డియో వాస్కులర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో ధనియాలు ఎక్కువగా వాడటం వలన శరీరంలో ఉండే ఈ విషపూరిత లోహాలను బయటకు పంపిస్తాయి.

 

ధనియాలను ముఖ్యంగా పైత్యానికి ఉపయోగిస్తారు. ధనియాలను నూనె లేదా నెయ్యిలో వేయించి కొద్దిగా ఉప్పు, కారం కలిపి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుని తింటే అజీర్ణం, విరేచనాలు తగ్గుతాయి.

 

జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి తగ్గాలంటే ధనియాలను నూరి తలకు రాసుకుంటే ఫలితం వుంటుంది.

 

నిద్రలేమితో బాధపడేవాళ్లు ధనియాల కషాయంలో పాలు, పంచదార కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.