అమెజాన్‌లో 90 వేలు, ఫ్లిప్‌కార్ట్‌లో 40 వేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్‌లో 90 వేలు, ఫ్లిప్‌కార్ట్‌లో 40 వేల ఉద్యోగాలు

September 25, 2019

Amazon, Flipkart Gear Up For Mega Festive Sales

దేశంలో ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు దసరా, దీపావళి పండుగలను టార్గెట్ చేశాయి. పండుగల సందర్భంగా భారీగా ఆఫర్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉత్తమ సేవలందించడానికి వేలల్లో తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నాయి. అమెజాన్‌ 90 వేల మందికి, ఫ్లిప్‌కార్ట్‌ 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించాయి. వేర్ హౌజ్ నుంచి కస్టమర్ కేర్ వరకూ వివిధ స్థాయుల్లో వీరంతా పనిచేయనున్నారని తెలిపాయి. 

అమెజాన్‌ ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా అదే తేదీల్లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 15 కేంద్రాలతో వినియోగదారులకు సేవలందిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ-మెయిల్‌, చాటింగ్‌, సోషల్‌ మీడియా, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వినియోగదారులతో నిత్యం మాట్లాడేందుకు ఈ కేంద్రాల్లో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా తీసుకుంటున్న వారందరికీ శిక్షణనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా ఈ మొత్తం ఉద్యోగ కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.