ప్రకృతి అందాల నడుమ చేసే సాహస యాత్రలంటే కుర్రాళ్ళకు రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. అందులోనూ వెంట ఫ్రెండ్స్ వస్తే అనుక్షణం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఫీల్ అవుతుంటారు. సెల్ ఫోన్ లకు, సోషల్ మీడియాకు, ఫ్యామిలీకి దూరంగా పచ్చటి చెట్లు, పక్షులు, వన్యప్రాణులు మధ్య చేసే ఈ నేచురల్ జర్నీని తమ లైఫ్ టైం గుర్తుంచుకుంటారు. అయితే గుంపులో గోవిందలా అందరూ ఒకే గూటికి చేరితే ఓకే, కానీ ఈ సాహస యాత్రలో ఎవరైనా దారితప్పితే గమ్యం చేరుకోవడానికి వారు పడే కష్టాలు వర్ణనాతీయం అనే చెప్పాలి.
తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఓ వ్యక్తి. అమేజాన్ ఫారెస్ట్ లో తప్పిపోయి 31 రోజులు అడవుల్లోనే గడిపాడు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. వెంట ఎలాంటి పరికరాలు లేవు, తాలదాచుకోవడానికి దిక్కులేదు అయినా ఏమాత్రం భయపడలేదు. తాను ఎలాగైనా బ్రతకాలి, తన ఫ్యామిలీని కలవాలన్న ధృడ సంకల్పంతో 31 రోజులు కేలవం వానపాములు, వర్షపు నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుని తన జీవుడిని బ్రతికించుకున్నాడు. అందరిని అవాక్కుచేశాడు.
చాలా మంది ప్రకృతి ప్రేమికులు , వన్యప్రాణుల ఔత్సాహికులకు అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ సందర్శించడం అనేది ఒక డ్రీమ్ . మనోహరమైన జీవవైవిధ్యం కారణంగా, ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యంగా కీర్తించబడుతున్న ఈ ఫారెస్ట్ అంతే ప్రమాదకరమైనది కూడా. ఎవరైనా రెయిన్‌ఫారెస్ట్‌లో తప్పిపోతే, అది వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. అటువంటి ప్రమాదకరమైన భూభాగంలో జీవించడం అనేది అత్యంత కఠినమైన విషయం. ఈ భయంకరమైన అడవిలోనూ ప్రాణాలను కాపాడుకుని చరిత్రలోకి ఎక్కాడు బొలీవియన్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి. అడవిలో తప్పిపోయిన ఈ వ్యక్తి 31 రోజులు ఎలా జీవించాడో అతని అనుభవాలను ఓ ఛానెల్ తో పంచుకున్నాడు.
ఉత్తర బొలీవియాకు చెందిన జొనట్టన్ అకోస్టాగా అనే వ్యక్తి , తన స్నేహితులతో కలిసి అమేజాన్ రెయిన్ ఫారెస్ట్ లో సాహస యాత్ర చేశాడు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత ఈ వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. ఎంత వెతికినా అతని స్నేహితుల జాడ కనిపించకపోవడంతో ఎలాగైనా ఈ అరణ్యం నుంచి బయటపడాలనుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు వర్షపు నీటిని షూస్‌లో సేకరించి తాగి దాహం తీర్చుకున్నాడు. అలాగే బ్రతకడానికి వాన పాములను, కీటకాలను ఆహారంగా తీసుకున్నాడు. ఇక ఈ అభయారణ్యంలో సంచరించే చిరుతపులులు, పెక్కరీలు వంటి ప్రమాదకరమైన జంతువుల నుండి తప్పించుకునేందుకు సహసాలే చేశాడు. “నేను పురుగులు తిన్నాను, నేను కీటకాలను తిన్నాను, ఈ 31 రోజులు జీవించడానికి నేను చేయాల్సిందల్లా చేశాను ఇది మీరు నమ్మరు” అని అతను తెలిపాడు.
జొనట్టన్ అకోస్టాగా అడవిలో అదృశ్యమైన వెంటనే, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. 31 రోజుల తరువాత, అతను పొదల్లో నుండి వారి వైపుకు వెళ్లినప్పుడు సెర్చ్ పార్టీ చివరకు అతన్ని రెస్క్యూ చేసింది. డీహైడ్రేట్ అయ్యి , 17 కిలోల బరువు తగ్గి ఎంతో దయనీకంగా కనిపించాడు ఈ వ్యక్తి. కానీ కౄరమృగాలు సంచారం చేసే అడవిలోనూ ఒంటరిగా సాహస యాత్ర చేసి ప్రాణాలతో బయటపడి విజేతగా నిలిచాడు . ప్రస్తుతం ఈ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు. కోలుకుంటున్నాడు.