అమెజాన్ మా 26వేల కొట్ల కొంపముంచింది.. బిగ్‌బజార్ ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ మా 26వేల కొట్ల కొంపముంచింది.. బిగ్‌బజార్ ఆవేదన

April 1, 2022

 

తమ కంపెనీకి చెందిన లాభదేవీలను అమెజాన్ కంపెనీ సర్వ నాశనం చేసిందని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ సంస్థ (బిగ్‌బజార్) సంచలన వ్యాఖ్యలు చేసింది. గతకొన్ని రోజులుగా అమెజాన్ – బిగ్‌బజార్ సంస్థల మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్యూచర్ గ్రూప్ సంస్థ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. అయితే, కొన్ని రోజులుగా కోర్టు వెలుపల ఇరు సంస్థలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఫ్యూచర్ ఆస్తులు స్వాధీనం చేసుకోవడాన్ని నిలువరించాలంటూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్ తరఫున హరీశ్ సాల్వే ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. రూ. 1400 కోట్ల (అమెజాన్-ఫ్యూచర్ డీల్) కోసం రూ.26 వేల కోట్ల విలువైన కంపెనీని అమెజాన్ నాశనం చేసిందని ఫ్యూచర్ రిటైల్ విమర్శించింది. తాను ఏదైతే చేయాలనుకుందో ఆ విషయంలో అమెజాన్ విజయం సాధించిందని పేర్కొంది. దీంతో తమతో వ్యాపారానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపింది. ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ స్వాధీనం చేసుకోవడాన్ని ఉద్దేశిస్తూ, భూములు లీజుకిచ్చిన వ్యాపారులు ఖాళీ చేయాలని నోటీసు ఇస్తే తాము ఏం చేయగలమని ప్రశ్నించింది. ఇప్పటికే 885 స్టోర్లను కోల్పోయామని, కేవలం 374 స్టోర్లు మాత్రమే మిగిలాయని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ వాదనను అమెజాన్ ఖండించింది.