ఆన్లైన్ యాప్‌లలో ఒకటి రెండు మినహాయిస్తే దాదాపుగా అన్నీ యాప్స్ ఇంగ్లీష్‌లోనే వినియోగదారుడితో కనెక్ట్ అవుతాయి. అయితే అందరికీ ఇంగ్లీష్ రాక గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఇబ్బుందులు పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం ముఖ్యంగా అమెజాన్ యాప్ మీద బాగా పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమెజాన్‌లో వస్తువులు కొంటున్నారు. వారికి తెలుగే ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా మంగళవారం నుంచి తన వెబ్సైట్, యాప్‌ను అప్డేట్ చేసింది. అలాగే దేశంలోని వివిధ భారతీయ భాషల్లోనూ లోకల్ భాషకు ప్రాముఖ్యతను ఇస్తూ అప్డేట్ అయింది. ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ప్రాంతీయ భాషలో మరింతమంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ కొత్త రూపును సంతరించుకుంది. ఆయా భాషల్లో తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నట్లు అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ వెల్లడించారు. దీంతో కొత్తగా 20 కోట్ల నుండి 30 కోట్ల మంది వినియోగదారులకు ఆన్లైన్ షాపింగ్ సులభం కానుంది. కాగా, ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లీష్, హిందీలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్స్, చెల్లింపులు జరిపేందుకు ప్రాంతీయ భాష తెలుగులో చక్కబెట్టుకోవచ్చు. మొబైల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, డెస్క్‌టాప్‌లో కస్టమర్లు తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ సిబ్బందితో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మాట్లాడవచ్చు.