ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త బిజినెస్‌లోకి ఎంటరయింది. అమెరికాలో కొత్తగా బట్టల దుకాణం ప్రారంభించింది. దీనికి అమెజాన్ స్టైల్ అనే పేరు పెట్టింది. వినియోగదారులు నేరుగా షోరూంకి వెళ్లి తమకు నచ్చిన బట్టలు, నచ్చిన సైజులో కొనుక్కోవచ్చు. కాలిఫోర్నియాలో ఈ షోరూం తెరవగా, ఇది ఫిజికల్‌గా మొదటి షోరూంగా నిలిచింది. ఇప్పటికే అమెజాన్ వెబ్సైట్లో దుస్తులు అందుబాటులో ఉన్నా అవి పరిమిత బ్రాండ్లే ఉన్నాయి.
కానీ, ఫిజికల్ షోరూంలో అన్ని కంపెనీల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ షోరూంని అత్యాధునికి టెక్నాలజీతో నిర్మించారు. దుస్తులు ట్రయల్ వేసేందుకు మనం ఫిట్టింగ్ రూం వరకు మోసుకెళ్లే అవసరం లేదు. అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే బట్టలే మన వద్దకు వస్తాయి. అలాగే బిల్లు చెల్లించేటప్పుడు దుస్తులను మోసుకెళ్లి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లినప్పుడు కూడా దుస్తులు మెషీన్ ద్వారా మన వద్దకు వస్తాయి. అంతేకాక, అమెజాన్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టిన దుస్తులు సరిగ్గా లేకపోతే వాటిని ఈ షోరూంలో తిరిగి ఇచ్చేయవచ్చు. ఇంకో ముఖ్య విషయం అమెజాన్ వెబ్ సైట్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. కానీ, ఈ ఫిజికల్ షోరూంకి మాత్రం టైమింగ్స్ ఉంటాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి. శుక్ర, శనివారాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ చేస్తారు. ఈ మేరకు అమెజాన్ కంపెనీ తెలియజేసింది.