హెచ్‌సీఏపై... కేటీఆర్‌కు రాయుడి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

హెచ్‌సీఏపై… కేటీఆర్‌కు రాయుడి ఫిర్యాదు

November 23, 2019

Ambati Rayudu cites corruption in Hyderabad cricket, opts out of Ranji Trophy

హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో అవినీతి రాజ్యమేలుతోందంటూ టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు సంచలన ఆరోపణలు చేశారు. హెచ్‌సీఏలో అవినీతిని కట్టడి చేయాలని.. సంఘంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. క్రికెట్ పాలకుల్లో చాలా మందిపై ఏసీబీ కేసులు ఉన్నాయని.. అలాంటివారు ఉన్న చోట క్రికెట్ ఎలా ఎదుగుతుందని తీవ్రంగా విమర్శించారు. ‘హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు కేటీఆర్ దృష్టి సారించాలి. దానిని నిర్మూలించాలి. అవినీతి పాలకులు, డబ్బు క్రికెట్ జట్టుపై ప్రభావం చూపుతుంటే.. మన హైదరాబాద్ గొప్పతనం ప్రపంచానికి ఎలా తెలుస్తుంది. పాలకులపై ఎన్నో ఏసీబీ కేసులు ఉన్నాయి. వాటిని వారు దాచి పెడుతున్నారు’ అని రాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఇదిలావుండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన HCA ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్యానెల్ విజయం సాధించింది. కాగా, రాయుడు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న కారణంతో క్రికెట్ నుంచి తప్పుకుని మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అప్పుడు టీమిండియా సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించారు.  ప్రస్తుతం రాయుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతున్నారు.