మనసు మార్చుకున్న రాయుడు.. రిటైర్మెంటు వెనక్కు! - MicTv.in - Telugu News
mictv telugu

మనసు మార్చుకున్న రాయుడు.. రిటైర్మెంటు వెనక్కు!

August 23, 2019

Ambati Rayudu..

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు నెలలోనే మనసు మార్చుకున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఆవేశంలో ఇచ్చిన తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాడని సమాచారం. ఈ దిశగా రాయుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. జులైలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు తాజా నిర్ణయంతో తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. 

టీమిండియా తరఫున రెండేళ్లు ఏకధాటిన ఆడిన రాయుడిని సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంచుకుంది. అతనైతే మూడు కోణాల్లో ఉపయోగపడతాడని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని రాయుడు ట్వీట్‌ చేశాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. మరొక సందర్భంలో టోర్నీలో శిఖర్‌ ధావన్‌, శంకర్‌‌లు గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న రాయుడిని ఎంపిక చేయకపోవడంపై అతడు మరింత నీరుగారిపోయాడు. పంత్‌, మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించి, భావోద్వేగానికి గురైన రాయుడు చివరికి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.

ఇంతలోనే రాయుడు మనసు మార్చుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్‌కమ్ చెబుతున్నారు. రాయుడు ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున టెస్ట్, ఐపీఎల్‌ ఫార్మాట్లలో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.