Home > Featured > కుడి ఎడమైతే.. ఎడమ కుడైతే..! ఆరెస్సెస్ సభలో అంబేడ్కర్.. విప్లవగీతాలతో గణేశ్ నిమజ్జనం

కుడి ఎడమైతే.. ఎడమ కుడైతే..! ఆరెస్సెస్ సభలో అంబేడ్కర్.. విప్లవగీతాలతో గణేశ్ నిమజ్జనం

Ambedkar.

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అని పాడుకున్నాడు భగ్నప్రేమికుడు దేవదాసు. కుడి ఎడమైతే మాత్రమే కాదు, ఎడమ కుడి అయినా ఫర్వాలేదంటున్నారు మన రాజకీయ నాయకులు. మారుతున్న కాలానికి తగ్గట్టు మనమూ మారిపోవాల్సిందేనంటున్నారు. లెఫ్ట్ రైట్ అయినా, రైట్ లెఫ్ట్ అయినా తేడాగీడా ఏమీ ఉండదని.. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికి అన్నట్లు సర్దుకుపోతుండాలని వక్కాణిస్తున్నారు. దీనికి అద్దం పట్టే ఉదంతాల్లోకి వెళ్తే..

ఆరెస్సెస్ హిందూ భావజాలానికి ప్రతీక. తాము అందర్నీ కలుపుకుపోతామని ఆ సంఘం నేతలు చెబుతున్నా దాని సిద్ధాంతాలపై హిందూ ముద్రలు ఇంకా బలంగానే ఉన్నాయి. రిజర్వేషన్ల కొనసాగింపుపై చర్చ జరగాలని ఇటీవల సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పలు దళిత సంఘాల నేతలు ఆయనను తప్పుబట్టారు. ఈ విమర్శల ఫలితమో, లేకపోతే కాలానికి తగ్గట్లు మారడమోగాని రాజస్థాన్‌లో జరిగిన ఆరెస్సెస్ ప్రదర్శనలో అంబేడ్కర్ కటౌట్ కనిపించింది. అది కూడా వివేకానంద స్వామి కటౌట్ పక్కనే. పుష్కర్‌లో జరుగుతున్న సంఘ్ సమావేశాల సందర్భంగా దేశ నాయకులు చిత్రాలతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అంబేడ్కర్‌తోపాటు సిక్కు మత స్థాపకుడైన గురునానక్ చిత్రాన్ని ప్రదర్శించారు. వీటిని చూసిన వారు.. ఆరెస్సెస్ తీరులో మార్పు కనిపిస్తోందని అంటున్నారు.

ఇక.. ఎడమ కుడి అయిన ఉదంతం ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. వీర లెఫ్టిస్టులు ఎర్రజెండెర్రజెన్నీయలో, ఓ అరుణ పతాకామా, చేగొనుమా రెడ్ సెల్యూట్స్ వంటి బ్రాండెడ్ విప్లవ గీతాల నడుమ గణేశుణ్ని కనువిందుగా నిమజ్జనం చేశారు. పెద్దకొత్తపల్లి గ్రామంలోని కమ్యూనిస్టులకు ఇది పాత అలవాటేనంట. తాము దేవుళ్లను నమ్మకపోయినా ఊరోళ్లు చేసుకునే పండగలో పాల్గొని ఇలా సంబరాలు చేసుకుంటామని కామ్రేడ్లు చెబుతున్నారు.

Updated : 9 Sep 2019 9:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top