అంబేద్కర్ చనిపోయాడా? చంపేశారా? - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ చనిపోయాడా? చంపేశారా?

December 6, 2017

‘కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, ఒక నీతిని గాని నిర్మించలేం..’  వర్ణవ్యవస్థతో పెనవేసుకుపోయిన హిందూ ధర్మాన్ని నిప్పుతో కడిగేలా అంబేద్కర్ అన్న మాటలు ఇవి. హీనంగా బతుకుతున్న దళితుల జీవితాలను మార్చడానికి ప్రయత్నించిన అంబేద్కర్ ఎందరికో శత్రువు అయ్యాడు. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజ్యాంగ రచన వరకు అంబేద్కర్ సాగించిన ప్రస్థానం, సాధించిన విజయాలతో గొప్ప గొప్ప నాయకులు కూడా కలవరపడ్డారు. భారత సమాజానికి సూర్యుడిలా మారిన అంబేద్కర్ ను అంతం చేసే కుట్రలు జరిగాయన్న సంగతి కొందరికే తెలుసు. అంబేద్కర్ మరణంపై ఉన్న అనుమానాలతో మరాఠీ రచయిత పురుషోత్తమ్ సదర్ ఓ పుస్తకం రాశారు. దాన్ని ‘హూ కిల్డ్ అంబేద్కర్’  పేరుతో ప్రొఫెసర్ విలాస్ ఖారత్ ఆంగ్లంలోకి అనువాదం చేశారు.  

బాబాసాహెబ్‌పై భౌతిక దాడులు

హిందూ ధర్మం అనేక అంతస్తులున్న గోపురం లాంటిది. దానికి మెట్లుగానీ కిటికీలుగానీ లేవు. అందులో పుట్టినవాడు అందులోనే అంతం కావాల్సిందే. ఆ గోపురంలో పుట్టి అక్కడే దుర్భరంగా అంతం అవుతున్న దళితుల తలరాత మారాలనుకున్నారు అంబేద్కర్. అంటరానితనానికి వ్యతిరేకంగా1927లో ఉద్యమించారు. వెనుకబడ్డ కులాలకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని మహద్ పట్టణం చెరువు లో దళితులకు భాగం ఇవ్వాలని సత్యాగ్రహం  చేశారు. ఆ సందర్భంలోనే బ్రాహ్మణ, బనియా వర్గాలకు చెందిన కొందరు బాబాసాహెబ్‌పై దాడికి దిగారు. ఈ విషయాన్ని అంబేద్కరే స్వయంగా తన రచనల్లో ప్రస్తావించారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో అంబేద్కర్ పోరాటం రెండు రూపాల్లో సాగింది. స్వాతంత్ర్యం కచ్చితంగా కావాల్సిందే. కాని అంతకుముందే దళితులకు రాజ్యాధికారంలో వాటా దక్కాలి. అందుకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి. అక్కడ దళితులు మాత్రమే ఓటు వేసి తమ నాయకున్ని ఎన్నుకోవాలి. బ్రిటిషర్లు ఉన్నప్పుడే వీటిని సాధించుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంక కాంగ్రెస్‌లోని అగ్రవర్ణ నాయకత్వం ఇందుకు ఒప్పుకోదని బాబాసాహెబ్ భావించారు. అందుకే 1918లో వచ్చిన సౌత్ బరోగ్ కమీషన్ ముందు ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం, దేశంలోని దళితుల స్థితిగతులను వివరించారు. కమీషన్ ముందు అంబేద్కర్ వినిపించిన వాదనలు హిందూ సమాజం పునాదులను  కదిలించేవి. అందుకే బాలాగంగాధర తిలక్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దేవద్దంటూ గాంధీ సహాయంతో కమీషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు.

అంబేద్కర్ ఆలోచనలను హిందూ  సమాజంలోని ఆధిపత్య శక్తులు ఒప్పుకోలేదు. కాని బ్రిటిషర్లు అంగీకరించారు. వర్ణ వ్యవస్థలో దళితులు అనుభవిస్తున్న అరిగోసను ఆధారాలతో సహా కమీషన్ ముందుంచారు భీంరావ్. దీంతో దళితులకు ఓటుహక్కుతో పాటు ప్రత్యేక నియోజకవర్గాలను ఇస్తూ 1932లో బ్రిటిష్ సర్కార్ కమ్యూనల్ అవార్డ్ ప్రకటించింది. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుంటే హిందూ సమాజంలో చీలికలు వస్తాయనుకున్నారు గాంధీ. ఇంతేకాదు హిందూ ధర్మం నుంచి దళితులు బయటకు పోయే ప్రమాదం ఉందని భయపడ్డారు. అందుకే కమ్యూనల్ అవార్డ్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఎరవాడ జైల్లో నిరాహాదరీక్షకు దిగారు. దేశంలోని మెజార్టీ వర్గాలు గాంధీకి మద్దతు ఇచ్చాయి. ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని అంబేద్కర్‌పై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చింది.

కాంగ్రెస్ నేతలు మదన్ మోహన్ మాలవ్యా, పల్వన్ కర్ బలూ.. అంబేద్కర్ తో చర్చించారు. ప్రత్యేక నియోజకవర్గాలతో దళితులకు లాభం కంటే నష్టమే ఎక్కువని వాదించారు. ఇంతేకాదు దళితులపై మెజార్టీ వర్గాలు దాడులు చేసే ప్రమాదం ఉందన్నారు. గాంధీ ఆరోగ్యం క్షీణిస్తుందని భయపెట్టారు. అంబేద్కర్ రాజీపడ్డారు. గాంధీ ప్రతిపాదనలకు ఒప్పుకున్నారు. ఫలితంగా ప్రత్యేక నియోజకవర్గాల్లో దళితులకు మాత్రమే ఓటింగ్ లేకుండా కొన్ని సీట్లు కేటాయించడానికి ఒప్పందం కుదిరింది. ఇదే పూనా ఒడంబడిక. ఈ సమయంలోనే అంబేద్కర్‌ను చంపుతామని కొంతమంది బెదిరించారు. గాంధీ చెప్పినట్టు వినకుంటే అంతం చేస్తామన్నారు. నాసిక్‌కు చెందిన కొంతమంది విద్యార్థులయితే అంబేద్కర్‌ను చంపాలని సమావేశాలు పెట్టుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి.

వర్ణవ్యవస్థతో చీకట్లో కూరుకుపోయిన కులాలు, వర్గాలకు రాజకీయ, సామాజిక అవకాశాలు దక్కాలనుకున్నారు భావించారు. తన రాజ్యాంగ రచనలో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం పలు పరిష్కారాలను చూపించారు. మహిళలకు ఆస్తి హక్కుతో పాటు రాజకీయ అవకాశాలు దక్కేలా పోరాడారు. ఇవన్నీ మన సమాజంలోని అగ్ర కులాల ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. అంబేద్కర్ బతికి ఉంటే తమ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆయా కులాలు భయపడ్డాయి.  

బుద్ధం శరణం గచ్ఛామి

హిందువుగా పుట్టాను కాని హిందువుగా చావనని చెప్పిన అంబేద్కర్, దళితులకు బౌద్దంతోనే సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. 1956 అక్టోబర్ 14న  నాగ్‌పూర్‌లో ఆరు లక్షల మందితో బౌద్ధమతంలోకి మారారు. దేశంలోని దళితులంతా బుద్దిజం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో హిందూ సమాజం పునాదులు కదిలాయి. ఆ క్షణం నుంచే బాబాసాహెబ్‌ను భౌతికంగా లేకుండా చేసే  కుట్ర అమలు అయిందని అనుచరులు చెపుతారు..

బ్రాహ్మణ అమ్మాయిలను దళితులు పెళ్లి చేసుకోవద్దు

అంబేద్కర్ ప్రాణాలు పోవడానికి డాక్టర్ మాల్వాంకర్ కారణమని కొంతమంది దళిత మేధావులు ఆరోపిస్తారు. 1945లో డయాబెటిస్ బారిన పడ్డ బాబాసాహెబ్‌కు చికిత్స చేయడానికి సవితా కబీర్ అనే లేడీ డాక్టర్‌ను పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించడంలో కుట్ర ఉందంటారు. అప్పటికే మొదటి భార్య రమాబాయి చనిపోవడంతో సవితా కబీర్‌ను రెండో పెళ్లి చేసుకోవాలని మాల్వాంకర్ ఒత్తిడి చేశారంటారు.  టైంకు తినకపోయినా, మందులు వేసుకోకున్నా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేనని మాల్వాంకర్ భయపెట్టారని చెపుతారు. దీంతో అనివార్యంగా సవితా కబిర్‌ను బాబాసాహెబ్ రెండో పెళ్లి చేసుకున్నారు.

డాక్టర్ సవితా కబీర్.. మాల్వాంకర్‌కు అసిస్టెంట్. అంబేద్కర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆయన జీవిత భాగస్వామిగా మారిన వ్యక్తి. బ్రాహ్మణ మహిళ దళితుడిని వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఆమె ధైర్యాన్ని చాలామంది మెచ్చుకున్నారు కూడా. కానీ ఆమెపైనే చాలామంది అంబేద్కర్ అనుచరులకు అనుమానాలున్నాయి. అంబేద్కర్ ఉండకూడదని కోరుకుంటున్న శక్తులు తమ పథకానికి సవితను పావుగా ఉపయోగించుకున్నారని వాళ్లు ఆరోపిస్తారు. అణగారిన వర్గాల కోసం భీంరావ్ చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కోలేక ఆయన్ను లేకుండా చేయడానికి కొంతమంది కుట్ర చేశారని అందులో భాగంగానే అంబేద్కర్ జీవితం ఆయనకు తెలియకుండానే అనుకోని మలుపులు తిరిగిందంటారు.

సవితా కబీర్‌తో వివాహం తర్వాత అంబేద్కర్ మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారు. మామూలుగానే ఆమెకు కోపం ఎక్కువ. అంబేద్కర్ స్నేహితులు ఇంటికొస్తే చిరాకు పడేది.  బ్రాహ్మణ మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని ఓ సభలో మాట్లాడి వెళ్లుతున్నప్పుడు ఓ యువకుడు అంబేద్కర్‌ను అడిగాడు. ‘‘నేను చేసింది తప్పో ఒప్పో తెలీదు. కానీ దళిత యువకులు నన్ను అనుకరిచొద్దు’’ అని బాబాసాహెబ్ సమాధానం ఇచ్చారు. ఈ జవాబే అంబేద్కర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందన్న ప్రశ్నకు కారణమైంది.

చంపేదాక వదలదు

1956 మార్చి 18 అంబేద్కర్‌ను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర జరుగుతోందన్న అనుమానం మొదలైన రోజు. డాక్టర్ ఎఫ్.బస్టన్‌తో కలిసి డాక్టర్ కృష్ణమూర్తి అంబేద్కర్‌ను కలిశారు. అంబేద్కర్ నిరసనంగా కనిపించారు. డయాబెటిస్ అదుపులోకి రాలేదు. ఇంకా పెరిగింది. మాల్వాంకర్ చికిత్స పనిచేయడం లేదని తెలుసుకున్న కృష్ణమూర్తి, మేడమ్ బస్టన్‌తో చికిత్స చేయించాలనుకున్నాడు. సవిత ఇందుకు ఒప్పుకోలేదు. మాల్వాంకర్ తప్ప ఇంకెవరూ అంబేద్కర్‌కు చికిత్స చేయవద్దని కరాఖండీగా చెప్పింది. మద్రాస్‌కు తిరిగివెళ్లాక అంబేద్కర్ కు రాసిన లేఖలో సవితా కబీర్ తీరుపై డాక్టర్ కృష్ణమూర్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణించడానికి సవితా కబీరే కారణమన్నారు. ప్రాణాలు తీసేవరకు ఆమె వదిలేలా లేదన్నారు. ఇప్పటికైనా వేరే డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ సంకలిత రచనల్లో డాక్టర్ కృష్ణమూర్తి లెటర్ ఇప్పటికీ ఉంది. ఇంతేకాదు అంబేద్కర్ హెల్త్ కండీషన్‌పై ఆయన సన్నిహితుడు రత్తు దగ్గర కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే బాబాసాహెబ్ బతికేది కొద్దిరోజులే అన్నారు.

నేపాల్ లో ఏం జరిగింది?

భారత రాజ్యాంగ రచన తర్వాత తమ దేశ రాజ్యాంగాన్ని కూడా రాయాలని అంబేద్కర్‌ను నేపాల్ రాజు ఆహ్వానించారు. దీన్ని ఆ దేశంలోని అగ్రకులాలు వ్యతిరేకించాయి. ఇండియాలోని అగ్రకులాల పెత్తనానికి తెరదించినట్టే నేపాల్‌లో కూడా జరుగుతుందని  భయపడ్డాయి. అప్పటి నుంచే అంబేద్కర్‌ను అంతం చేసే కుట్రలు మొదలయ్యాయని చెప్పుకుంటారు. నేపాల్ రాజ్యాంగం రాసే ప్రతిపాదనలపై చర్చించడానికి సవితా కబీర్‌తో కలిసి అంబేద్కర్ 1956లో ఆ దేశానికి వెళ్లారు. అక్కడి రాజ కుటుంబ మహిళలతో సవిత అమర్యాదగా ప్రవర్తించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అంబేద్కర్ విడాకుల ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ 6న నిద్రలోనే ఆయన చనిపోయారు. కీలక విషయం ఏంటంటే బాబాసాహెబ్ పార్థివదేహాన్ని తాకడానికి కూడా సవితా కబీర్ ఎవరినీ అనుమతించలేదు. పోస్ట్‌మార్టమ్ చేయించాలని సన్నిహితులు చెప్పినా వినలేదు. కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి కూడా ఆమె ఒప్పుకోలేదని అంబేద్కర్ అనుచరులు ఆరోపిస్తారు.

కమీషన్ రిపోర్ట్ లో ఏముంది?

అంబేద్కర్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సన్నిహితులు సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. డీఐజీ సక్సేనా కమిషన్‌ను నాటి ప్రధాని నెహ్రూ ఏర్పాటుచేశారు. విచారణ సమయంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు అంతా సవితనే అనుమానించారు. కీలక విషయం ఏంటంటే అంబేద్కర్ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇంటి నుండి మొదటి ఫోన్ కాల్ డాక్టర్ మాల్వాంకర్‌కు వెళ్లినట్టు కమిషన్ విచారణలో తేలింది. విచిత్రం ఏంటంటే  ఇప్పటిదాకా  ఆ రిపోర్ట్ పార్లమెంట్ ముందుకు రాలేదు. భారత రాజ్యాంగ రచయితకు ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం ఇది.

కొంతమంది దళిత మేధావులు, రచయితల వాదన ప్రకారం అంబేద్కర్‌ను అంతం చెయ్యడానికి ఆధిపత్య వర్గాలు కుట్ర చేశాయి. అందులో భాగంగానే అంబేద్కర్ జీవితంలోకి డాక్టర్ మాల్వాంకర్,సవితా కబీర్ వచ్చారు. చికిత్స  ఎలా జరిగిందోగానీ ఇన్సులిన్ ఓవర్ డోస్ అంబేద్కర్ పై స్లోపాయిజన్‌లా పనిచేసిందంటారు. చనిపోయే రోజు రాత్రి 11 గంటల దాకా సన్నిహితులతో కులాసాగా కబుర్లు చెప్పారు అంబేద్కర్. పదకొండున్నరకు నిద్రపోయారు. అదే ఆఖరి రాత్రి. దళిత సూర్యుడు తెల్లారి ఉదయించలేదు.

ఒక అంటరానివాడు అందనంత ఎత్తుకు ఎదగడాన్ని  ఈ దేశంలోని అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోయాయి. ప్రతిక్షణం వెంటాడి, వేధించాయి. అందుకే అంబేద్కర్ మరణం అనుమానించే అవకాశాన్ని ఇచ్చింది.