రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి

July 8, 2020

hfth

భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ముంబైలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజ్‌గృహాలో చొరబడి వీరంగం సృష్టించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో వరండాలో ఉన్న పూల కుండీలను చిందరవందరగా పడేశారు. ఈ దాడిలో స్వల్ప విధ్వంసం చోటు చేసుకుంది. వెంటనే అక్కడ పని చేసే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తు వేగం చేశారు. ఈ ఘటనను ఆయన వారసులు ప్రకాష్ అంబేద్కర్, ఆనందరాజ్ అంబేద్కర్  ఖండించారు. సీసీ ఫుటేజీలను కూడా ధ్వంసం చేసి పారిపోయినట్టు ఆరోపించారు. 

అంబేద్కర్ ముంబైలో స్థిరపడిన తరువాత  1930లో ఈ మూడు అంతస్తుల భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇది హెరిటేజ్ మ్యూజియంతో పాటు స్మారక చిహ్నంగా ఉంది. దీంట్లో మొదటి అంతస్తు వరకు అంబేద్కర్ వ్యక్తిగత వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. మిగితా రెండు అంతస్తులు ఆయన వారసులు వాడుతున్నారు. ప్రతి రోజూ ఇక్కడ సందర్శకులకు అనుమతి ఉంటుంది. కానీ ఇటీవల లాక్‌డౌన్ కారణంగా మ్యూజియం మూసివేశారు. ఎవరూ లేని సమయం చూసి దాడికి తెగబడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. తక్షణమే విచారణకు ఆదేశించారు.