మృతదేహంతో 3 వేల కి.మీ.. చలించిన సీఎం
లాక్‌డౌన్ వల్ల బతికి ఉన్నోళ్లే బోలెడన్ని కష్టాలు పడుతున్నారు. చనిపోతున్నవాళ్లకు అధికారులే దిక్కవుతున్నారు. కరోనా వస్తుందన్న భయంతో రక్తసంబంధీకులు కూడా మృతదేహాలను ముట్టుకోవడం లేదు. ఇంతటి కలికాలంలో మానవత్వం పరిమళించింది. అంబులెన్స్ డ్రైవర్లు ఇద్దరు విస్తుగొలిపే సాహసం చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మృతదేహంతో ఏకంగా పలు రాష్ట్రాల గుండా సాగి 3 వేల కి.మీ. దూరం ప్రయాణించారు. మృతుణ్ని అతని బంధుమిత్రులు కడసారి చూసుకునే అవకాశాన్ని కల్పించారు.
మిజోరంకు చెందిన వివియన్ లాల్రేంసగా అనే యువకుడు చెన్నైలో పనిచేస్తూ గతవారం గుండెపోటుతో చనిపోయాడు. లాక్ డౌన్ వల్ల మృతదేహాన్ని అతని కుటుంబం వద్దకు చేర్చడానికి సమస్యలు ఎదరయ్యాయి. ఎవరూ ముందుకు రాలేని సమయంలో జయంతజీరన్, చిన్నతంబీ అనే అంబులెన్సు డ్రైవర్లు తాము తీసుకెళ్తామన్నారు. వివియన్ స్నేహితుడు దారి చూపుతుండగా మూడున్నర రోజులు ప్రయాణించారు. 3 వేల కిలోమీటర్లను 84 గంటల సమయంలో దాటేసి బుధవారం ఐజ్వాల్‌కు చేరుకున్నారు. అంబులెన్సు వస్తుండగా స్థానికులు రోడ్డుపైకి చప్పట్లతో అభినందించారు. అంబులెన్స్ డ్రైవర్లే రియల్ హీరోలు అని సీఎం జోరంతంగా ట్వీట్ చేశారు. ‘నిజమైన హీరోలకు మిజోరం స్వాగతం పలుకుతోంది. మానవతావాదం, జాతీయవాదాన్ని మేం విశ్వసిస్తాం. తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని ఆయన చెప్పారు. డ్రైవర్లకు ఒక్కొక్కరికి రెండు వేల నగదుతోపాటు, మిజో సంప్రదాయ దుస్తులు బహూకరిస్తామన్నారు.
This is how #Mizoram welcomes them real life heroes!
Because we believe in humanity and nationality!#Mizoram #TamilNadu @CMOTamilNadu thank you! pic.twitter.com/GHMhMNm4tf
— Zoramthanga (@ZoramthangaCM) April 28, 2020