కంచెలతో కష్టాలు..అంబులెన్స్‌‌ కూడా దారిలేదు - MicTv.in - Telugu News
mictv telugu

కంచెలతో కష్టాలు..అంబులెన్స్‌‌ కూడా దారిలేదు

March 26, 2020

కరోనా వైరస్ గ్రామాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. వేరే ఊరి నుంచి ప్రజలు తమ గ్రామాల్లోకి వస్తే ఎక్కడ వైరస్ వ్యాపిస్తుందోనని కంచెలు,రాళ్లు రప్పలు ఏర్పాటు చేస్తున్నారు. చాలా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల అత్యుత్సాహం కారణంగా కొన్నిసార్లు అత్యవసర సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అంబులెన్సులు, అత్యవసర పరిస్థితిలో వెళ్లే వారికి అడ్డంకులుగా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఓ అంబులెన్సుకు కూడా ఇలాంటి కష్టాలు తప్పలేదు. 

వీణవంక మండలం గంగారంలో గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్థులు ముళ్ళకంచెలు వేశారు. అదే సమయంలో అత్యవసర సేవల కోసం 108 అంబులెన్సు ఆ మార్గంలోకి వచ్చింది. గ్రామ సరిహద్దుల్లోకి రావడంతో కంచె కారణంగా అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది స్వయంగా కంచెను తొలగించి 108 వాహనానికి లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ప్రాంతంలో ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలు వచ్చిపడుతున్నాయని అంటున్నారు. మరో వైపు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా చిక్కులు వస్తాయని అంటున్నారు. కంచెలకు బదులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.