కరోనాపై డబ్బులు ఏరుకుంటున్న అంబులెన్సులు  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై డబ్బులు ఏరుకుంటున్న అంబులెన్సులు 

March 23, 2020

khhn

శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు కదా.. దానిని నిజం చేయడానికి అంబులెన్స్ యాజమాన్యాలు పూనుకున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడాన్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు. సూర్యాపేటలో ఓ అంబులెన్స్ ప్రయాణికులను చేరవేస్తూ పట్టుబడడంతో అంబులెన్స్‌ల దందా వెలుగుచూసింది. పైకి పేషెంట్లు అని కలరిస్తూ లోపల ప్రయాణికులను తీసుకువెళ్తున్నారు. ఎలాగో సైరన్ మోగుతుంది కాబట్టి పోలీసులు అనుమానించే ఛాన్స్ లేదని భావించారు. కానీ, పోలీస్ కన్ను కదా.. పసిగట్టేసింది. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని సూర్యాపేటలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు అంబులెన్స్‌పై అనుమానం రావడంతో తెరిచి చూశారు. అందులో రోగికి బదులు ప్రయాణికులు దర్శనం ఇచ్చారు. 

పోలీసులు వారిని కిందకు దించేసి.. అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో డ్రైవర్లు చెప్పిన ఛార్జీలు విని పోలీసులు షాక్ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకెళ్లేందుకు రూ.1000 నుంచి 2000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోనూ ఇలాంటి దందా చేస్తున్నారు. అయితే సూర్యాపేట ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. అంబులెన్స్‌లపై మరింత నిఘా పెంచుతాం అని చెప్పారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో, హైవే రోడ్లపై కూడా చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, లాక్‌డౌన్‌ను కూరగాయల వ్యాపారులు, పాలు, చికెన్ వ్యాపారులు కూడా క్యాష్ చేసుకుంటున్నారు. చికెన్ రూ.200లకు కిలో విక్రయిస్తున్నారు. అలాగే టమాటాలు, బెండకాయలు, వంకాయలు రూ.100కి కిలో అమ్ముతున్నారు. దీంతో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఇంటినుంచి బయటకు వెళ్తే కరోనా ప్రభావం ఓవైపు భయపెడుతుంటే.. మరోవైపు వ్యాపారుల లాలూచీ కూడా జనాలను బెంబేలెత్తిస్తోంది.