తిరుపతిలో అంబులెన్సుల దందా.. తన్ని తరిమేశారు - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతిలో అంబులెన్సుల దందా.. తన్ని తరిమేశారు

April 26, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్సుల డ్రైవర్లు పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే, అత్యవసర పరిస్థితిలో అంబులెన్సు కావాలని అడిగితే వేయ్యి కాదు. రెండు వేలు కాదు. ఏకంగా పదివేల రూపాయలు వసూలు చేస్తున్నా ఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అంబులెన్సుల డ్రైవర్లు దందా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.

వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పనిచేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు.

దీంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ, పుట్టేడు దు:ఖంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లను సంప్రదించాడు. అయితే, 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు ఉచిత అంబులెన్సు వచ్చినా డ్రైవర్‌ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని విషణ్ణ వదనంతోనే బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది.

అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.10 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు. అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని, లేదంటే ధర్నాలు చేస్తామని ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వాని వేడుకున్నారు.