అమీన్‌పూర్ అత్యాచార ఘటన అంతా ఉత్తిదే.. అసలు కథ ఇది - MicTv.in - Telugu News
mictv telugu

అమీన్‌పూర్ అత్యాచార ఘటన అంతా ఉత్తిదే.. అసలు కథ ఇది

January 25, 2020

Ameenpur

హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ అత్యాచార ఉదంతం కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఓ బాలికను కొంత మంది అపరిచితులు ఎత్తుకెళ్లి లైంగికదాడి చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఎవరూ ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అత్యాచారమే జరగలేదని ఆ బాలిక కట్టుకథ అల్లినట్టుగా తేల్చారు. పోలీసులను తప్పుదారి పట్టించినందుకు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించేశారు. 

ఫిర్యాదు చేసిన ఆ బాలికకు ఇటీవల సందీప్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్టు తేల్చారు. ఈ క్రమంలోనే  వీరిద్దరూ కలసి గురువారం ఉదయం కలసి మియాపూర్‌లో సినిమాకు వెళ్లారు. చాలా సేపటి నుంచి కూతురు కనిపించకపోవడంతో తల్లి ఫోన్ చేసింది. అప్పుడు ఏం చెప్పాలో తెలియక తనను ఎవరో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ చెప్పింది. వెంటనే బాలికను తీసుకెళ్లి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అసలు విషయం బయటపడింది. ఆ బాలిక బైక్‌పై మరో వ్యక్తితో వెళ్తున్నట్టు గుర్తించారు. దీంతో అత్యాచారం అంతా కట్టుకథ అని తేల్చారు. సందీప్‌పై మాత్రం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.